బిలాస్‌పూర్ టు రాయ్‌పూర్.. ట్రైన్‌లో ప్రయాణించిన రాహుల్ గాంధీ (Video)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ఛత్తీస్‌గడ్‌లో ట్రైన్‌లో ప్రయాణించారు. బిలాస్ పూర్ టు రాయ్‌పూర్‌కు ఆయన ఇంటర్‌సిటీ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ సందర్బంలో తోటి ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు.

రాయ్‌పూర్: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సోమవారం ఛత్తీస్‌గడ్‌లో ట్రైన్‌లో ప్రయాణించారు. బిలాస్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అనంతరం, ఆయన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ వెళ్లడానికి ట్రైన్ ఎంచుకున్నారు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ఆయన ట్రైన్‌లో ప్రయాణించారు. ఆయన వెంటే రాష్ట్ర సీఎం భుపేశ్ భగేల్, రాష్ట్ర పార్టీ ఇంచార్జీ కుమారి సెల్జా, రాష్ట్ర పీసీసీ చీఫ్ దీపక్ బైజ్ సహా పలువురు నేతలు ఆయన వెంటే ఉన్నారు.
రాహుల్ గాంధీ ట్రైన్ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ హ్యాండిల్ ఎక్స్‌లో షేర్ చేసింది. తోటి ప్రయాణికులతో రాహుల్ గాంధీ సంభాషించినట్టు ఆ ఫొటోలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర రైల్వే శాఖ 2,600 ట్రైన్‌లను రద్దు చేసిందని ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధించింది. ఈ నిర్ణయం ప్రజలకు అనేక కష్టాలను తెచ్చి పెట్టిందని వివరించింది.
బిలాస్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవాస్ న్యాయ్ సమ్మేళన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన చేపడుతుందని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ఓబీసీ, దళితులు, గిరిజనులు, మహిళల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం పెరగడానికి దోహదపడుతుందని వివరించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన చేపట్టిందని, ఆ వివరాలను విడుదల చేయడానికి ప్రధాని మోడీకి ఉలుకు ఎందుకు అని ప్రశ్నించారు. ఎందుకు భయపడుతున్నారని అడిగారు.
Also Read : మేరీ మాటీ, మేరీ దేశ్: పవిత్ర మట్టితో ఢిల్లీ వరకు అమృత కలశ్ యాత్ర: బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి
అలాగే రిమోట్ వ్యాఖ్యలనూ గుప్పించారు. రిమోట్‌ను చేతిలోకి తీసుకుని ప్రజలకు చూపించారు. రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ వద్ద ఉంటే పేదలు, అవసరార్థులకు ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు. అదే బీజేపీ వద్ద రిమోట్ కంట్రోల్ ఉంటే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే కాంట్రాక్టులు అదానీకి దక్కుతాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు.