సారాంశం
కేంద్ర కెబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
Caste Census: జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు...మోదీ సర్కార్ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామన్నారు. ''కుల గణన నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. పార్లమెంటులో కులగణన చేయిస్తామని చెప్పాం. ఇప్పుడు చేయిస్తున్నాం. అయితే ఈ కులగణన ఎప్పట్లోపు పూర్తిచేస్తారో ప్రభుత్వం చెప్పాలి" అని రాహుల్ గాంధీ డిమాండ్ చేసారు.
రాహుల్ గాంధీ చెప్పిన 10 ముఖ్య విషయాలు
1. "పార్లమెంటులో కులగణన చేపడతామని చెప్పాం. 50% పరిమితిని, కృత్రిమంగా పెట్టిన ఆ గోడను కూడా కూల్చివేస్తామని చెప్పాం."
2. "నరేంద్ర మోడీ కేవలం నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని అంటుంటారు. అకస్మాత్తుగా కుల గణన ప్రకటించారు. దీనికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం.
3. "కులగణనకు గడువు ఎప్పుడో చెప్పాలి. ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం."
4. "ఇది మొదటి అడుగు మాత్రమే. కుల గణనకు తెలంగాణ ఒక మోడల్. అక్కడ చేపట్టిన కులగణన దేశంలో చేపట్టే గణనకు బ్లూప్రింట్ కావచ్చు. కుల గణన రూపకల్పనలో ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఉంది. రూపకల్పన చాలా ముఖ్యం. రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి బీహార్, రెండోది తెలంగాణ. రెండింటికీ చాలా తేడా ఉంది. తెలంగాణలో చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకోవాలి"
5. "కుల గణన మొదటి అడుగు అని నేను మళ్ళీ చెబుతున్నాను. కుల గణన ద్వారా పూర్తిగా కొత్త అభివృద్ధి నమూనాను తీసుకురావాలనేది మా దృక్పథం."
6. "కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాదు, ఓబీసీ, దళితులు, గిరిజనుల భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకోవాలి. కుల గణన ద్వారా అది తెలుస్తుంది, కానీ దానికి మించి వెళ్ళాలి."
7. "మా సంస్థల్లో వీరి భాగస్వామ్యం ఎంత? అధికార వ్యవస్థల్లో వీరి భాగస్వామ్యం ఎంత? ఇది తదుపరి అడుగు. ఈ దిశగా కుల గణన జరగాలని మేము కోరుకుంటున్నాం."
8. "ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు చట్టం ఉంది. ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం."
9. "జనాభా లెక్కల్లో జాప్యం జరిగింది. దీనిని వ్యతిరేకించారు. కుల గణన మా దృక్పథం. వారు దానిని అంగీకరించారు. చాలా బాగుంది. మేము దానిని స్వాగతిస్తున్నాం."
10. "గడువు ఏమిటో చెప్పాలి. ఎప్పుడు ఈ గణన పూర్తవుతుంది? బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించాలి. ప్రస్తుతం బడ్జెట్‌లో దీనికి నిధులు లేవు."
కులగణనపై తెలుగు రాష్ట్రాల సీఎంల రియాక్షన్
కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ కు తలొగ్గి కేంద్రం కులగణన నిర్ణయం తీసుకుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణనకు అంగీకరించిన ప్రధాని మోదీకి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కులగణన నిర్ణయంపై స్పందించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న నినాదానికి ఈ నిర్ణయమే నిదర్శనం అన్నారు. కులగణన ద్వారా ఖచ్చితమైన సమాచారంతో పథకాలు అర్హులకే దక్కుతాయని చంద్రబాబు అన్నారు.