కాంగ్రెస్ మళ్లీ ఉత్తరప్రదేశ్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నదా? రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తున్నాడని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ప్రకటన వెనుక ఈ కోణాన్ని చూస్తున్నారు. గత ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీపై ఓడిపోయిన రాహుల్ గాంధీ అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి కేంద్రమంత్రిపై పోరాడాలని నిర్ణయం జరిగినట్టు సమాచారం. 

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కీలకం. అక్కడ నెగ్గితే చాలా వరకు విజయానికి మార్గం సుగమం చేసుకున్నట్టే. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ యూపీ ఆ పార్టీకి బలమైన రాష్ట్రంగా ఉండేది. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీలు కంచుకోటల వంటివి. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. మళ్లీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ సమాంతరంగా యూపీని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నది. అందుకే రాహుల్ గాంధీని మళ్లీ యూపీలోని అమేథీ నుంచి బరిలోకి నిలబెట్టాలని చూస్తున్నది. అమేధీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు.

2004 తర్వాత అమేథీని సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీకి మార్గంగా ఇచ్చింది. అప్పటి నుంచి రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే, 2019లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమంటే.. ఓడిన చోటే నిలబడి కలబడాలని నిశ్చయించుకున్నారన్నట్టుగా అనుకోవచ్చు. అంటే.. మరోసారి అమేఠీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేయనున్నట్టు అర్థం అవుతున్నది. ఈ సారి కూడా ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా? కేవలం అమేఠీ నుంచి పోటీకి సిద్ధపడతారా? అనేది తేలాల్సి ఉన్నది.

2019లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, కేరళలోని వయానాడ్‌ల నుంచి పోటీ చేశారు. అమేథీలో స్మృతి ఇరానీపై సుమారు 55 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందాడు. వయానాడ్‌ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లారు.

Also Read: కోచింగ్ హబ్ ‘కోటా’లో పెరిగిన ఆత్మహత్యలు.. పరిష్కారంగా కొత్తరకం ఫ్యాన్లు.. ఉరి వేసుకుంటే ఊడివచ్చేలా..! (Video)

అలాగే.. వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలున్నట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లోనే ప్రధాని మోడీపై వారణాసి నుంచి పోటీ చేయాలని ప్రియాంక భావించినట్టు సమాచారం. కానీ, చివరి నిమిషంలో అజయ్ రాయ్‌ను బరిలోకి దించినట్టు తెలిసింది. మోడీపై అజయ్ రాయ్ ఓడిపోయారు. ఈ సారి ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నది. దీనిపై అజయ్ రాయ్ స్పందిస్తూ.. ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. ఆమె ఒక వేళ వారణాసి నుంచి పోటీ చేస్తే తామంతా ఆమె గెలుపునకు కృషి చేస్తామని వివరించారు.