కోచింగ్ హబ్‌గా పేరుపోయిన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ఈ ఏడాదిలో ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులో ఎక్కువ మంది ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలే అధికంగా ఉన్నాయి. అందుకే ఉరితాడు వేసుకోగానే ఆ ఫ్యాన్ సీలింగ్ నుంచి ఊడిపోయి వచ్చేలా కొత్త రకం ఫ్యాన్లను ఇప్పుడు కోటాలోని అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్టు వసతుల్లో ఏర్పాటు చేస్తున్నారు.
జైపూర్: పలు రకాల కోచింగ్‌ల కోసం అనేక రాష్ట్రాల విద్యార్థులు రాజస్తాన్‌లోని కోటాకు తరలివెళ్లుతుంటారు. కోటా కోచింగ్ హబ్‌గా పేరొందింది. కానీ, ఆత్మహత్యలతో అప్రదిష్టనూ మూటగట్టుకుంది. ఇక్కడ కోచింగ్ తీవ్రతతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇంటికి దూరంగా ఉండి నిత్యం పుస్తకాల్లో మునిగి కనీసం సెలవులకూ నోచుకోకుండా ఉంటున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందుకే కోటాలో ఆత్మహత్యలా? హత్యలా? అంటూ అనేక విధాల చర్చ జరుగుతున్నది. ఈ ఆత్మహత్యలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, గత ఎనిమిదేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఆత్మహత్యలు మరింత పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి.
ఈ ఆత్మహత్యలు ఎక్కువగా హాస్టళ్లలో, పెయింగ్ గెస్టుల్లో ఫ్యాన్లకు ఉరివేసుకున్నవే ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం ఆ ఫ్యాన్లను మార్చాలని నిర్ణయించింది. ఫ్యాన్‌కు ఉరివేస్తే.. బరువును గుర్తించి ఆ ఫ్యానే కిందికి ఊడివచ్చి చైన్‌కు వేలాడే కొత్త రకం ఫ్యాన్లను ఇప్పుడు కోటాలో ఏర్పాటు చేస్తున్నారు. కోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్ గెస్టు వసతుల్లో ఈ స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని కోటా జిల్లా మెజిస్ట్రేట్ ఇప్పటికే ఆదేశించారు.
Also Read: Pet Dog: రెండు పెంపుడు కుక్కల మధ్య పోట్లాట.. షూట్ చేసిన యజమాని.. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం (Video)
ఈ స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లతో ఫ్యాన్లకు ఉరివేసుకుని చేసుకునే ఆత్మహత్యలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొత్త ఏర్పాటు చేస్తున్న స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లకు ఉరివేసుకుంటే.. బరువును గుర్తించి ఆ ఫ్యాన్ అనకాయిల్ అవుతుంది. అంటే... ఫ్యాన్ సీలింగ్ నుంచి వేరై కిందికి ఒక చైన్ సహాయంతో వేలాడుతుంది. దీంతో ప్రాణాలు దక్కుతాయి. ఈ ఫ్యాన్లు వెంటనే అన్ని హాస్టళ్లు, పీజీ వసతులు ఏర్పాటు చేయాలని, లేదంటే, సీజ్ చేస్తామని అధికారులు ఆదేశించారు. అంతేకాదు, విద్యార్థులకు కచ్చితంగా వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని అధికారులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
