Asianet News TeluguAsianet News Telugu

మోదీ, అదానీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. ఆ భయం ప్రధాని కళ్లలో చూశాను: రాహుల్

దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఇంతకుముందు చాలాసార్లు చెప్పానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు ఉదాహరణలు ఈ రోజూ చూస్తూనే ఉన్నామని తెలిపారు. 

rahul gandhi says i will keep questioning the relationship between pm modi and adani ksm
Author
First Published Mar 25, 2023, 1:18 PM IST

దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఇంతకుముందు చాలాసార్లు చెప్పానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు ఉదాహరణలు ఈ రోజూ చూస్తూనే ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాలపై తాను పార్లమెంటులో ప్రశ్నలు అడిగానని చెప్పారు. రాహుల్ గాంధీ  లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆయన నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగం రద్దు చేయబడిందని అన్నారు.  తరువాత తాను లోక్‌సభ స్పీకర్‌కి వివరణాత్మక సమాధానం రాశానని చెప్పారు. 

కొంతమంది మంత్రులు తన గురించి అబద్ధాలు చెప్పారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాను విదేశీ శక్తుల నుండి సహాయం కోరానని మాట్లాడుతున్నారని.. కానీ అలాంటిదేమి లేదని చెప్పారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని చెప్పారు. అదానీ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై మంత్రుల ఆరోపణలు, అనర్హత గేమ్ అని విమర్శించారు. 

అయితే తాను ప్రశ్నలు అడగడం ఆపనని.. ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అదానీ షెల్‌ కంపెనీల్లో రూ. 20,000 కోట్లను ఎవరు పెట్టుబడిగా పెట్టారనేది ప్రశ్న అని.. ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటానని చెప్పారు. భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య స్వరాన్ని రక్షించడానికి తాను ఇక్కడ ఉన్నానని.. దానిని కొనసాగిస్తానని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు. తాను అదానీ సమస్యపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని.. అనర్హత వేటు వేసి జైల్లో పెట్టిన తనను భయపెట్టలేరని చెప్పారు. తాను వెనక్కి తగ్గనని చెప్పారు. 

అదానీపై తాను తర్వాతి స్పీచ్‌లో ఏం మాట్లాడుతానని ప్రధాని భయపడుతున్నారని.. అది ఆయన కళ్లలో తాను చూశానని చెప్పారు. అందుకే తనపై అనర్హత వేటు వేశారని అన్నారు. అదానీ, మోదీల మధ్య చాలా దృఢమైన బంధం ఉందని ఆరోపించారు. అదానీని రక్షించేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తుందని ప్రశ్నించారు. 

తనకు మద్దతిచ్చిన ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. తనను శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించినా.. తన పని చేస్తూనే ఉంటానునని చెప్పారు. ఈ ప్రభుత్వానికి దేశమే అదానీ.. అదానీ దేశమే అన్నట్టుగా ఉందని మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios