రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని సోమవారం ఉదయం పునరుద్ధరించారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్ ఏంట్రీతో పార్లమెంట్ సీన్ మారిపోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని సోమవారం ఉదయం పునరుద్ధరించారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అనంతరం దాదాపు గంటన్నర వ్యవధిలో రాహుల్ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నేరుగా పార్లమెంట్‌లోకి ప్రవేశించారు.

ఆయన పార్లమెంటు లోపలికి చేరుకుని కాంగ్రెస్ ఎంపీలు, భారత కూటమి నేతలతో సమావేశమయ్యారు. అనంతరం నేరుగా లోక్‌సభకు వెళ్లారు. రాహుల్ సభకు చేరుకోగానే కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీకి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ.. ఘనంగా స్వాగతం పలికారు. రాహుల్ కూడా సభ్యులందరికీ ముకుళిత హస్తాలతో అభివాదం చేసి తన స్థానంలో కూర్చున్నారు.

రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాహుల్ గాంధీ ప్రధాన వక్తగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపింది. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వాగతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఉపశమనం కలిగించిందని అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత సోమవారం నుంచి పార్లమెంట్ సీన్ మారిపోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

అవిశ్వాస తీర్మానం 

ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No-confidence motion) లోక్‌‌సభలో మంగళవారం (రేపు) చర్చ ప్రారంభం కానుంది. ఈ చర్చలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొనున్నారు. అవిశ్వాస తీర్మానంపై సభలో ఆయన కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. ఆగస్టు 8 నుంచి 10 వరకు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.

ఈ చర్చలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. మణిపూర్ హింసాకాండపై చర్చ నేపథ్యంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ తరుపున ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మణిపూర్ హింసాకాండపై చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ సభలోకి రీఎంట్రీ ఇవ్వడం.. అలాగే.. అంతకుముందు రాహుల్ మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతాలను సందర్శించడం కూడా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో సహాయం పడుతాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్ గాంధీ శిక్షపై స్టే 

మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి శుక్రవారం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. అతని శిక్షపై కోర్టు రెండేళ్లపాటు స్టే విధించింది. ఆ తర్వాత ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.