రాహుల్ భట్ హత్య నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీర్ పండిట్లు శుక్రవారం ఆందోళన చేశారు. తమకు భద్రత లేదని, తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సామూహికంగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని పీఎం ప్యాకేజీ ఉద్యోగులు లెఫ్టినెంట్ జనరల్ కు లేఖ రాశారు.
కాశ్మీరీ పండిత్ కమ్యూనిటీకి చెందిన రాహుల్ భట్ హత్యకు వ్యతిరేకంగా శుక్రవారం కాశ్మీర్ లోయలో నిరసనలు వెల్లువెత్తాయి. తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కాశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రైమ్‌మినిస్టర్స్ రిటర్న్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ కాశ్మీరీ మైగ్రెంట్స్ ప్యాకేజీ ఉద్యోగులు అంతా తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు వారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాకు బహిరంగ లేఖ రాశారు.
కశ్మీరీ పండిట్లను బలిపశువు చేస్తున్నారు.. కేంద్రంపై టెర్రరిస్టులు చంపిన కశ్మీర్ పండిట్ భార్య ఫైర్
‘‘ అడ్మినిస్ట్రేషన్ విధానాల పట్ల నిరుత్సాహం, గత 12 సంవత్సరాలుగా లోయలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ మైనారిటీలందరికీ భద్రతా భావాన్ని అందించడంలో వైఫల్యం, రక్షణ కల్పిస్తామని చెప్పి నిరాశను మిగిల్చినందున మేము రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చాం. సామూహిక రాజీనామాలు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. మా ప్రాణాలను కాపాడుకోవడానికి ఇది ఏకైక పరిష్కారమని మాకు తెలుసు ’’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా తమను కలిసి భద్రతకు భరోసా ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలు హత్య జరిగిన తరువాత గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ అంతటా కొనసాగాయి. అయితే శుక్రవారం ఉదయం ఎయిర్‌పోర్టు రోడ్డు వైపు కవాతు చేసేందుకు ప్రయత్నించినప్పుడు, నిరసన తెలుపుతున్న జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్‌లు, లాఠీచార్జిని కూడా ఉపయోగించారు.
కాశ్మీర్ సమస్యకు హనుమాన్ చాలీసా చదవడం, లౌడ్ స్పీకర్లను తీసేయడం పరిష్కారం కాదు - సంజయ్ రౌత్
జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో కాశ్మీర్ పండిత్ అయిన రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆయన చదూరా ప్రాంతంలోని తహసీల్ ఆఫీసులో క్లర్క్ గా పని చేస్తున్నారు. అతడిపై కాల్పులు జరిగిన వెంటనే స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించారు. కాగా రాహుల్ భట్ అంత్యక్రియలు ఈ రోజు బంతలాబ్లో జరిగాయి
ఈ ఘటనపై రాహుల్ భట్ తండ్రి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ మొదట రాహుల్ భట్ ఎవరని అడిగారు. తరువాత కాల్చిచంపారు. మాకు విచారణ కావాలి. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసు స్టేషన్ వంద అడుగుల దూరంలో ఉంది. తహసీల్ ఆఫీసు వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ ఉండాలి కానీ అక్కడ ఎవరూ లేరు. విచారణ అధికారులు CCTV ఫుటేజీని తనిఖీ చేయాలి ’’ అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. గతంలో లోయలోని వివిధ ప్రాంతాలలో కాశ్మీరీ హిందువులను టార్గెట్ గా చేసుకొని బెదిరింపు లేఖలు వచ్చాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే ఇస్లాం కాశ్మీరీ హిందువులకు ఏప్రిల్ 2022లో ఈ లేఖలు పంపించింది. అయితే వీటిపై సంతకం లేదు. వీటిలో ‘కాశ్మీర్‌ను విడిచిపెట్టండి లేదా చంపేయండి’ అని హెచ్చరికలు ఉన్నాయి.
