ఐపీఎస్‌పై మనసు పారేసుకుంది.. పోలీసులకు చుక్కలు చూపిస్తోంది

Punjab Woman Comes To Ujjain To Meet IPS Officer sachin atulkar
Highlights

ఐపీఎస్‌పై మనసు పారేసుకుంది.. పోలీసులకు చుక్కలు చూపిస్తోంది

దేశంలో సినీ స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులతో పాటుగా నిజాయితీ గల అధికారులను అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక యువతి అభిమానం మాత్రం అదుపు తప్పింది.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లాగా పనిచేస్తోన్న సచిన్ అతుల్కర్ చూడటానికి సినిమా హీరోలా ఉంటారు.. దీంతో ఆయనకు మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.. అలా ఎస్పీ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన పంజాబ్‌లోని హోషియాపూర్‌కు చెందిన ఓ 27 ఏళ్ల యువతి ఆయన అందానికి ఫిదా అయ్యింది. అతనిని చూడాలనిపించి వెంటనే ఇంట్లో చెప్పకుండా ఉజ్జయినీ బయలుదేరింది.

ఆయనను ఎలాగైనా కలవాలని మూడు రోజుల నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తోంది. మూడు రోజుల నుంచి అక్కడే తచ్చాడుతుండటంతో మహిళా పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఆమెను అదుపులోకి తీసుకుని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పింది. సోషల్ మీడియాలో సచిన్ ఫోటోలు చూసిన తర్వాత ఆయనపై అభిమానం పెరిగిందని.. మనసు పారేసుకున్నానని యువతి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

ఎస్పీని కలిసి ఆయనకు తన ప్రేమ విషయం చెప్పాలని స్పష్టం చేయడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు చేసేది లేక యువతి తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించి.. వారితో పంపించాలని చూసినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు.. బలవంతంగా ట్రైన్ ఎక్కించాలని చూసినప్పటికీ.. తనను రైలు ఎక్కిస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో చేసేదేం లేక తిరిగి స్టేషన్‌కు తీసుకువచ్చారు..

ఈ విషయం ఎస్పీ సచిన్ దాకా వెళ్లడంతో ఆయన స్పందించారు.. ఓ ప్రభుత్వాధికారిగా తాను ఎవరినైనా కలుస్తానని.. కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోనని స్పష్టం చేశారు. మరి ఈ సమాధానం విని యువతి ఏం చేయదలచుకుందో కానీ.. పోలీసులకు మాత్రం తలప్రాణం తోకలోకి వస్తోంది.

loader