ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఇటీవల రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరో సారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో ఈ ఆంక్షలు విధించారు.
దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఉన్న యూపీలోని ఘజియాబాద్ లో 144 సెక్షన్ విధించారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాజ్ఞలు విధించినందున అనుమతి లేని ఏ సమావేశాలను జిల్లాలోకి అనుమతించబోమని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ రాకేశ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఈ ఆజ్ఞల నేపథ్యంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకూడదని అడ్మినిస్ట్రేటివ్ పేర్కొంది. మతపరమైన ప్రదేశాల్లో తప్ప లౌడ్ స్పీకర్ల వాడకాన్ని అనుమతించబోమని తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని అనేక నగరాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం హింస చెలరేగడంతో ఘజియాబాద్ జిల్లా యంత్రాంగం ఈ చర్య తీసుకుంది.
దీనికి ఒక రోజు ముందుగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని జిల్లాల మెజిస్ట్రేట్‌లను ఆయా జిల్లాలలో శాంతిభద్రతలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాన్పూర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు యోగీ సర్కార్ ఈ భద్రతా ఏర్పాట్లు చేసింది. కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్, లక్నోలో ఇప్పటికే సెక్షన్ 144 అమలులో ఉంది. తాజాగా దానిని ఘజియాబాద్‌లోనూ అమలు చేయనున్నారు. దీంతో పాటు ఘజియాబాద్ జిల్లా యంత్రాంగం కూడా డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించనుంది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు, పోలీసు కెప్టెన్‌లతో శనివారం సమావేశం నిర్వహించిన తరువాత కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. శాంతిభద్రతలతో ఆడుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, భద్రతా వ్యవస్థను పటిష్టంగా ఉంచాలని కోరారు. కాగా.. గత శుక్రవారం నాటి హింసాకాండ ఘటనలో ఇప్పటివరకు 306 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా సహరాన్‌పూర్‌లో 71, హత్రాస్‌లో 51, అంబేద్కర్‌నగర్‌లో 34, ప్రయాగ్‌రాజ్‌లో 92, మొరాదాబాద్‌లో 35, ఫిరోజాబాద్‌లో 15, అలీగఢ్‌లో 6, జలౌన్‌లో 2 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలు : షాకిచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్.. పోటీ చేస్తానంటూ ప్రకటన, కానీ ట్విస్ట్
ఈ ఘటన విషయంలో యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం ప్రార్థనల అనంతరం తొమ్మిది జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఇందులో 13 మంది పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు, ఫిరోజాబాద్, అలీఘర్, హత్రాస్, మొరాదాబాద్, అంబేద్కర్‌నగర్, ఖేరీ, జలౌన్‌లలో ఒక్కొక్క ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. యూపీ ప్రభుత్వం మాదిరిగానే అస్సాంలోని నాలుగు జిల్లాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఇందులో కచార్, కరీంగంజ్, హైలకండి, బొంగైగావ్ లు ఉన్నాయి. ఈ సందర్భంగా అన్ని రకాల ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలను జిల్లా యంత్రాంగం నిషేదించింది.
