రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగుతానంటూ ప్రకటించి లాలూ ప్రసాద్ యాదవ్ షాకిచ్చారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయాల్సిందే. 

ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు (President Polls) ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్డీయే (nda), యూపీఏ (upa) వర్గాలు ఎవరికీ వారు అభ్యర్ధులను రంగంలోకి దించుతున్నాయి. అటు విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్సీపీ (ncp) అధినేత శరద్ పవార్‌ (sharad pawar) బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) సైతం తానూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు. జూన్‌ 15వ తేదీన నామినేషన్‌ పేపర్లు దాఖలు చేసేందుకు ఢిల్లీకి ఫ్లైట్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నట్లు లాలూ ప్రకటించారు.

అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. ఈయన ఆర్జేడీ చీఫ్‌, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాదు. బీహార్‌ రాజకీయాల్లో, అక్కడ ఎన్నికల సమయం వచ్చిన ప్రతీసారి తీవ్ర గందరగోళానికి గురిచేసే వ్యక్తి ఇతను. ఆయన పేరు కూడా లాలూ ప్రసాద్‌ యాదవ్‌. సరన్‌ జిల్లా మరహౌరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రహీంపుర్‌ గ్రామవాసి. ఈ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను అంతా ము‍ద్దుగా ‘కర్మభూమి’ అని పిలుస్తుంటారు. గతంలోనూ ఈయన రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేశారు. 

2017లో నామినేషన్‌ పేపర్లు సైతం దాఖలు చేశారు. ఆ సమయంలో బీహార్‌ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే ఆ సమయంలో లాలూ పేరుని ప్రతిపాదించేంత, బలపరిచేంత మంది లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. అందుకే ఈసారి మాత్రం అన్ని లెక్కలు చూసుకుని బరిలో దిగుతున్నాడు. 

అయితే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పంచాయితీ నుంచి ప్రెసిడెంట్‌ ఎన్నికల దాకా దేన్ని వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ మేరకు గతంలో ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కానీ అతనిని మాత్రం విజయం వరించలేదు. కాగా.. 2014 లోక్‌సభ ఎన్నికలలో తన భార్య రబ్రీదేవి ఓటమికి ఈ లాలూ కూడా ఓ కారణమంటూ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోపించారు. 

Also Read:రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకురండి.. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌లకు టాస్క్ అప్పగించిన బీజేపీ

ఇదిలా ఉంటే ఈ సారి కూడా ఎన్డీయే అభ్య‌ర్థినే రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోబెట్టాల‌ని బీజేపీ (bjp) వ్యూహాలు రచిస్తోంది. ఎన్డీయే అభ్యర్థి భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్నిక అవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే ఆధిపత్యం నెగ్గ‌డానికి, ఆ మేజిక్ మార్కుకు 1.2 శాతం ఓట్ల దూరంలో వుంది. ఎన్డీయే మిత్రకూట‌మి అయిన.. అన్నాడిఎంకే, తటస్థ పార్టీలైన ఏపీలోని వైసీపీ, బీజూ జనతాదళ్ మద్ధతు ఇస్తాయని బీజేపీ ధీమాతో ఉంది. 

ఇక, జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో రాజ్యసభ ఎంపీలు 233 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేసేందుకు ఏ రాజకీయ పార్టీకి అధికారం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.