పౌరసత్వ సవరణ బిల్లు: విద్యార్ధులపై లాఠీఛార్జీ, నిరసనకు దిగిన ప్రియాంక గాంధీ
విద్యార్ధులు, స్థానికులకు మద్ధతుగా సోమవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. ఆదివారం ఈ నిరసన సెగ దేశ రాజధానిని తాకింది.
మరోవైపు విద్యార్ధులు, స్థానికులకు మద్ధతుగా సోమవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. జామియా యూనివర్సిటీలో విద్యార్ధులపై లాఠీ ఛార్జీకి నిరసనగా ఆమె బైఠాయించారు.
Also Read:నాకు బాధ కలిగిన రోజు: పౌరసత్వ ఆందోళనలపై మోడీ దిగ్భ్రాంతి
విద్యార్ధుల పట్ల అమానుషుంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ప్రజాగళాన్ని వినేందుకు కేంద్రం భయపడుతోందని.. యువత ధైర్యాన్ని బీజేపీ ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ప్రియాంక ఆరోపించారు.
ఢిల్లీలో ఆందోళనలపై ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రియాంక... బీజేపీ ప్రభుత్వం పిరికి పంద ప్రభుత్వమని విమర్శించారు. యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్ధులపై దాడి చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.
Also Read:అల్లర్లు వెంటనే నిలిపివేయాలి: జామీయా విద్యార్థుల లాఠీఛార్జీపై సుప్రీం
ఉద్రిక్తతల సమయంలో ప్రభుత్వం.. ప్రజల బాధలను వినాల్సిన అవసరం ఉంది కానీ దాడులు చేయడం సరికాదని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతంతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని విద్యార్ధులను, జర్నలిస్టులను బీజేపీ ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. యువత గొంతును ప్రధాని మోడీ అణిచివేయలేరన్నారు.