పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్ధులు చేస్తున్న ఆందోళనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. సోమవారం తనకు తీవ్రమైన బాధ కలిగిన రోజుగా మోడీ అభివర్ణించారు.

Also Read:అల్లర్లు వెంటనే నిలిపివేయాలి: జామీయా విద్యార్థుల లాఠీఛార్జీపై సుప్రీం

ప్రజా ఆస్తులకు నష్టం, సాధారణ జీవితానికి భంగం కలిగించడం దేశ ధర్మంలో భాగం కాదని ప్రధాని అన్నారు. పౌరసత్వ చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరమని, ఇది తనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయన్నారు.

చర్చ, వాదం, అసమ్మతి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగాలని, కానీ ఎప్పుడూ ప్రజా ఆస్తులకు నష్టం చేకూర్చడం, పౌర జీవితానికి భంగం కలిగించడం మన ధర్మంలో భాగం కాదన్నారు. భారతదేశ అభివృద్ధి, ప్రతి భారతీయుల సాధికారత కోసం, ముఖ్యంగా పేదలు, అణగారిన.. అట్టడుగున ఉన్న వారి కోసం మనమందరం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.

Also Read:పౌరసత్వ రగడ: ఢిల్లీలో నిరసన హింసాత్మకం

ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఆసక్తి చూపుతున్న సమూహాలను తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ అనుమతించమని మోడీ పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదివారం దక్షిణ ఢిల్లీలో హింసాత్మక వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి తెలిసిన బస్సులతో పాటు ఫైరింజిన్‌కు నిప్పు పెట్టారు.