ఐదు,ఆరో తరగతులు చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ కీచక టీచర్ ను.. విషయం తెలిసీ చర్యలు తీసుకోని స్కూలు హెడ్మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ : పిల్లలకు విద్యాబుద్దులు చెప్పి మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన టీచర్లు తప్పు దోవ పడుతున్నారు. స్వయంగా తామే దారుణానికి పాల్పడుతూ.. విద్యార్థినుల పట్ల కీచకుల్లా మారుతున్నారు. అలాంటి ఓ కీచక టీచర్ ను.. ఆ విషయం తెలిసీ మౌనంగా ఉన్న స్కూలు హెడ్మాస్టర్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరి జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 50 ఏళ్ల ఉపాధ్యాయుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హపోలీ ప్రాంతంలోని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా అరెస్ట్ చేశారు.
హెడ్మాస్టర్ కు టీచర్ చేస్తున్న దారుణనేరం గురించి తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోనందున.. అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తల్లిదండ్రులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, నిందితులైన టీచర్, ప్రిన్సిపాల్ లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారని లోయర్ సుబంసిరి ఎస్పీ కేని బాగ్రా తెలిపారు.
నిందితుడు ఐదు, ఆరు తరగతులకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు.హపోలీ మహిళా పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
గత నవంబర్‌లో, షి-యోమి జిల్లాలోని ఒక పాఠశాల హాస్టల్ వార్డెన్ ఆరుగురు అబ్బాయిలు, 15 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు అయ్యాడు. వీరిలో ఆరుగురు అత్యాచారానికి గురయ్యారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితుల గోప్యతను కాపాడేందుకు బాధితుల గుర్తింపును వెల్లడించలేదు)
