గవర్నర్ ఎన్ఎస్ వోహ్రా హయాంలో నాలుగోసారి

పిడిపి-బిజెపి సంకీర్ణ బంధానికి బీటలువారాయి. మిత్రపక్షం పిడిపి కి తమ మద్దతు ఉపసింహరించుకుంటున్నట్లు బిజెపి ప్రకటించడంతో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ రాజకీయాలే వేడెక్కాయి. వెంటవెంటనే పరిణామాల్లో మార్పులు సంభవించి చివరకు మెజారిటీ కోల్పోయిన పిడిపి ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏ పార్టీకి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే మెజారిటీ లేకపోవడంతో జమ్మూ కశ్మీర్ లో గవర్నర్ పాలన అనివార్యమైంది.

పీడీపీ ప్రభుత్వం ఉన్నఫలంగా కూలిపోవడంతో గవర్నర్ ఎన్ఎస్ వోహ్రా చేసిన గవర్నర్ పాలన విధించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు సిపార్సు చేశారు. దీనిపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్రపతికి విన్నవించారు. దీంతో వెంటనే జమ్మూ కశ్మీర్ లో గవర్నర్ పాలన విధిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. అందుకు సంబంధించిన సిపార్సు ప్రతిపై రాజముద్ర వేశారు. ఇలా జారీ చేసిన సిఫార్సు ప్రతిని కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు.

జమ్మూకశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో మరోసారి గవర్నర్ పాలన అనివార్యమైంది. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్‌ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా హయాంలోనే ఇప్పటివరకు మూడుసార్లు గవర్నర్‌ పాలన అమల్లోకి రాగా ఇపుడు నాలుగోసారి అమలుకానుంది.