గతేడాది అక్టోబర్ నుంచి బీహార్ లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు మొదటి విజయం లభించింది. ఆయన స్థాపించిన జన్ సూరజ్ అభియాన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మొదటిసారిగా గెలుపు రుచి చూశారు. ఆయన స్థాపించిన జన్ సూరజ్ అభియాన్ మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇంత కాలం ఇతర పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే.. తొలిసారిగా సొంతంగా ఓ అభ్యర్థిని గెలుపించుకున్నారు. ఇది ఆయన ఖాతాలో మొదటి విజయంగా రికార్డు కానుంది.
గౌతమ్ అదానీకి శరద్ పవార్ మద్దతు.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ టార్గెటెడ్ గా ఉందంటూ వ్యాఖ్యలు..
బీహార్ లో ఇటీవల రాష్ట్ర శాసనమండలిలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో శరణ్ (గ్రాడ్యుయేట్), గయ (గ్రాడ్యుయేట్), గయ (టీచర్స్), కోసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, శరణ్ (టీచర్స్)కు ఉప ఎన్నికలు జరిగాయి. గురువారం అర్థరాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన జన్ సూరజ్ అభియాన్ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి శరన్ (టీచర్స్) నుంచి విజయం సాధించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ రెండో స్థానానికి పడిపోయింది.
కాగా.. సీపీఐ మాజీ ఎమ్మెల్సీ కేదార్ నాథ్ పాండే మరణంతో శరణ్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉమ్మడి మహాకూటమి అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్సీ పాండే కుమారుడు ఆనంద్ పుష్కర్ పోటీ చేయగా.. ఆయన జన్ సూరజ్ అభియాన్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి అఫాక్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు.
గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జన సూరజ్ యాత్ర’ను ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ కు అహ్మద్ గెలుపు పెద్ద స్థైర్యాన్ని ఇస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 75 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 24 మంది సభ్యులున్నారు. జేడీయూ 23 మంది ఎమ్మెల్సీలతో రెండో స్థానానికి పడిపోయింది. గతంలో నితీశ్ పార్టీకి 24 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. బీజేపీ ఒక స్థానాన్ని నిలబెట్టుకోగా, జేడీయూ నుంచి ఒక స్థానాన్ని చేజిక్కించుకుంది.
గయ (టీచర్స్), గయ (గ్రాడ్యుయేట్స్) స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కోసీ (గ్రాడ్యుయేట్స్), శరణ్ (గ్రాడ్యుయేట్స్)లలో మహాకూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గయ నుంచి పోటీ చేసిన రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ కుమారుడు పునీత్ కుమార్ సింగ్ ఓటమి పాలయ్యారు.
