రాహుల్ గాంధీపై వేటు పడిన అంశంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో పరువు నష్టం కేసులో పడిన శిక్ష ఎక్కువే అనిపించిందని అన్నారు. అదే విధంగా రాహుల్ పై అనర్హత వేటు వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు ప్రదర్శించాల్సిందని వివరించారు. కేంద్రం వాజ్‌పేయి మాటలను గుర్తుంచుకోవాలని అన్నారు. 

న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు గురించి స్పందించారు. ఒక పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం ఎక్కువే అనిపించిందని వివరించారు. అలాగే, అధికార పక్షం కూడా కొంత పెద్ద మనసు చేసుకోవాల్సిందని అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని అంత వేగంగా తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసే గడువు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు.

బిహార్‌లో జన్ సూరత్ యాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రజలను చేరువకావడానికి సంపూర్ణంగా సిద్ధమైనట్టు లేదని అన్నారు. 

‘నేను న్యాయ నిపుణుడిని కాదు. కానీ, ప్రాసెస్ ఆఫ్ లాను చూస్తే రాహుల్ గాంధీకి విధించిన శిక్ష మోతాదు ఎక్కువే అనిపిస్తున్నది. ఎన్నికల వేడిలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదే చివరిదీ కాబోదు’ అని అన్నారు.

‘ఒక పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష విధించడం ఎక్కువ తీవ్రతతో కూడిన శిక్షనే అనిపిస్తున్నది’ అని తెలిపారు. ‘ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలని అనిపిస్తున్నది. అటల్ బిహారి వాజ్‌పేయి మాటలను కేంద్రానికి గుర్తు చేయదలిచాను. చిన్న హృదయంతో పెద్దోడివి కాలేవు అనే మాటను కేంద్రం గుర్తు చేసుకోవాలి’ అని అన్నారు.

‘రాహుల్ గాంధీకి శిక్ష పడ్డాక అనర్హత వేటు తప్పకుండా పడుతుందనేటుటవంటి కొన్ని టెక్నికాలిటీస్ వెనుక కేంద్ర ప్రభుత్వం దాక్కోవడం సరికాదు. నేను ఇప్పటికీ అంటా.. వారు ఎంతో గౌరవం ఇచ్చే అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది. రాహుల్ గాంధీపై వేటు వేయడంపై అంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సింది కాదు’ అని అన్నారు. 

Also Read: ఆ గ్రామ సర్పంచ్ సాహసోపేత నిర్ణయం మత కలహాలను నివారించింది.. ఏం జరిగిందంటే?

‘ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది. పెద్ద మనసు చూపించాల్సిన బాధ్యత వారి మీదే ఉన్నది. వారు ఇంకొన్ని రోజులు ఆగాల్సింది. ఆ పార్టీ సూరత్ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేసుకున్నాక, వారికి మరే అవకాశాలు లేవని సంకేతాలు వస్తే అప్పుడు రాహుల్ పై వేటు వేయాల్సింది’ అని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ ఇంకా తాము ఎవరితో పోరాడుతున్నామో పూర్తిగా అవగాహనకు రాలేదని అనిపిస్తున్నదని అన్నారు. పార్టీ అధినాయకులు ఢిల్లీలో కూర్చుని ట్వీట్లు చేసి, పార్లమెంటు వరకు మార్చ్‌లు చేపట్టి పోరాడే విధానం సరిపోదని తెలిపారు.