Asianet News TeluguAsianet News Telugu

ఆ గ్రామ సర్పంచ్ సాహసోపేత నిర్ణయం మత కలహాలను నివారించింది.. ఏం జరిగిందంటే?

మహారాష్ట్రలోని సావర్దే గ్రామంలో 18 ఏళ్ల మోమిన్ మత విద్వేషాన్ని రగిల్చే ఓ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అది గ్రామంలో హిందూ, ముస్లిం మతస్తుల మధ్య చిచ్చురేపినట్టయింది. మోమిన్ పై పోలీసు కేసు ఫైల్ అయింది. అయినా, గ్రామంలో ఇంకా శాంతి నెలకొనలేదు. గ్రామ సర్పంచ్ సాహసోపేత నిర్ణయంతో గ్రామంలో శాంతి నెలకొనే అవకాశం చిక్కింది.
 

village sarpanch bold decision prevented communal violence between hindu muslim in a maharashtra village kms
Author
First Published Mar 25, 2023, 6:05 PM IST

ముంబయి: అది మహారాష్ట్రలోని సావర్దే గ్రామం. సుమారు 15 వేల జనాభా. హిందు మెజార్టీగా ఉండే ఆ గ్రామంలో ముస్లిం కమ్యూనిటీ ప్రజలూ వారితో సామరస్యంగా నివసిస్తున్నారు. అయితే, ఓ 18 ఏళ్ల బాలుడి వాట్సాప్ స్టేటస్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరిచింది. మత కలహాలు జరిగే ముప్పును తెప్పించింది. కానీ, ఆ గ్రామ సర్పంచ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వాటిని నివారించగలిగింది.

18 ఏళ్ల మోమిన్ తన వాట్సాప్ స్టేటస్‌గా ఓ వీడియో పెట్టాడు. అందులో ఔరంగబాద్, మొఘల్ పాలకుడు ఔరంగజేబు గురించి ఉన్నది. ఔరంగాబాద్ నగరం పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. మార్చి 16వ తేదీన ఈ స్టేటస్ పెట్టాడు.

ఈ స్టేటస్‌తో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మోమిన్ ఇంటి చుట్టూ సుమారు 500 మంది గుమిగూడారు. మోమిన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆ కుటుంబాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ వాట్సాప్ స్టేటస్ తీసేయడానికి మోమిన్ నిరాకరించడంతో పోలీసులు ఆ ఏరియాలో వారంపాటు 144 సెక్షన్ విధించారు. రిలీజియస్ సెంటిమెంట్‌లను గాయపరిచినందుకు మొహమ్మద్ మోమిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ, అసలు సవాలు గ్రామ సర్పంచ్ ముందు ఉన్నది. ఈ గ్రామంలో మళ్లీ మత సామరస్యాన్ని ఎలా నెలకొల్పాలనేదే పెద్ద సవాల్‌గా మిగిలింది.

‘వారిలో ఒకడిగా ఉన్న నేను, వారి మద్దతు గెలిచిన నేను ఒక బలమైన నిర్ణయం కష్టంగా మారింద’ని సర్పంచ్ అమోల్ కాంబ్లే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ‘నా మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవం. కానీ, సర్పంచ్‌గా చట్టానికి లోబడి పని చేయాలి. కాబట్టి, ఆ కుటుంబం మొత్తాన్ని బహిష్కరించాలనే డిమాండ్‌ను వ్యతిరేకించాను’ అని తెలిపారు.

‘నాకు తెలుసు చాలా మంది మనోభావాలు గాయపడ్డాయి. కానీ, ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఏదైతే జరిగిందో అది బాధాకరమే. కానీ, దాన్ని అక్కడికే ఆపేయాలని నిర్ణయించుకున్నా’ అని వివరించారు. తనకు ఉభయ మతాల నుంచి మద్దతు ఉన్నదని తెలిపారు.

మోమిన్ కుటుంబం వారి భద్రత కోసం ఆందోళన చెందింది. మోమిన్ 35 ఏళ్ల అన్న హైదర్ మాట్లాడుతూ.. మాకు ఇప్పటికీ కొంత భయం ఉన్నది. నా తమ్ముడి చేసిన పనికి నా కుటుంబానికి ఏ చేటు జరగవద్దని కోరుకుంటున్నాను. శాంతి సుస్థిరత నెలకొనడానికి ఇరు వర్గాల నుంచి కృషి జరుగుతున్నది. అయినా.. ఎక్కడో కొంత భయం మాత్రం ఉన్నది. మార్చి 16వ తేదీ ఘటనతో నా తల్లిదండ్రులూ భయపడ్డారు’ అని అదే గ్రామంలో పుట్టి పెరిగిన హైదర్ తెలిపాడు.

పర్షురాం చవాన్ మోమిన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్‌ ఫైల్ అయ్యేలా చేశాడు. ఆ కుటుంబాన్ని బహిష్కరించాలనే డిమాండ్ కూడా ఆయన నుంచే మొదలైంది. మోమిన్ తండ్రి, ఆయన ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. మోమిన్ ఫ్యామిలీ కొంత మతానికి ఎక్కువ ఆకర్షితమై ఉన్నట్టు భావిస్తుందని పర్షురాం చెప్పాడు.

‘మోమిన్ వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టినప్పుడు.. అది చూడాలని తండ్రికి చెప్పాను. కానీ, అతను పట్టించుకోలేదు. ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం మినహా మరే దారి లేకుండా పోయింది’ అని పర్షురాం పేర్కొన్నాడు. 

‘గ్రామ పంచాయతీ నా డిమాండ్‌ను తిరస్కరించింది. వారికి ఏది సరైనది అనిపించిందో అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ, అలాంటి వారిని ఊరిలోనే ఉంచుకుంటున్నామంటే మరోసారి సమస్యను ఎదుర్కొనే ముప్పును వెంట ఉంచుకున్నట్టే’ అని అన్నాడు. 

Also Read: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ టెస్టులో రన్నింగ్ చేస్తూ అభ్యర్థి మృతి

సామాజిక కార్యకర్త, సావర్దే ముస్లిం కమ్యూనిటీ సభ్యుడు కలందర్ బాద్షా మకందర్ మాట్లా డుతూ, ఈ ఘటన తర్వాత ఉభయ మతస్తుల మధ్య నమ్మకం చాలా వరకు నీరుగారిపోయిందని అన్నాడు. ‘ఈ ఘటనతో మేమంతా భయపడ్డాం. రెండు కమ్యూనిటీల మధ్య విశ్వాసం సన్నగిల్లిపోయింది. నేను ఎల్లప్పుడూ నాకు క్లోజ్ అనుకునే వ్యక్తి ఇప్పుడేం ఆలోచిస్తున్నాడో తెలియకుండా ఉన్నది. అయితే పరిస్థితులు మళ్లీ సాధారణం అవుతున్నాయి. ఇందుకు ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. బహిష్కరణ డిమాండ్‌ను తిరస్కరించి గ్రామంలో కొత్త నెరేటివ్‌కు గ్రామ పంచాయతీ పునాది వేసింది. ఇది హర్షించదగ్గ సాహసోపేత నిర్ణయం. రెండు మతాల మధ్య విద్వేషాన్ని రగల్చాలని చూసే వారి కి ఇదో గుణపాఠం’ అని చెప్పాడు.

2008లో సమీపంలోని మిరాజ్ నగరంలో మత కలహాలు చోటుచేసుకున్నాయి. కానీ, ఈ గ్రామం ఎక్కువ ప్రభావితం కాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios