Asianet News TeluguAsianet News Telugu

మోడీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్...కేజ్రీవాల్ తో జోడి

ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా పేరుమోసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జత కట్టబోతున్నారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ మరోమారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థ ఐపాక్ తో ఒప్పందం చేసుకున్నాడు. 

prashant kishor joins hands with kejriwal for the upcoming delhi polls
Author
New Delhi, First Published Dec 14, 2019, 11:17 AM IST

న్యూ ఢిల్లీ: ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా పేరుమోసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జత కట్టబోతున్నారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ మరోమారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థ ఐపాక్ తో ఒప్పందం చేసుకున్నాడు. 

ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ఇందాక ఒక గంట కింద కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ట్వీట్ చేయగానే ఐపాక్ కూడా ఆ ట్వీటును రే ట్వీట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జగన్ తో జత కట్టి ఆయన గెలుపుకు ఎంత కృషి చేసారో మనందరికీ తెలిసిన విషయమే. 

Also read: డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్...ఏపీ మ్యాజిక్ రిపీట్ చేయగలడా?

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం, తమిళనాడులో డీఎంకే కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 

ప్రశాంత్ కిషోర్ బిజెపి మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) జేడీయూ, పార్టీకి ఉపాధ్యక్షుడు గా కొనసాగుతున్నాడు. 2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపికి  విజయవంతమైన లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రూపకల్పన చేసినందుకు గాను, ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా యావత్ దేశానికి సుపరిచితుడయ్యాడు.  ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతో ఏ పార్టీ అనే తేడా లేకుండా తమ సహాయ సహకారాలు కోరిన వారందరికీ అందిస్తుంది. 

విజయవంతమైన ట్రాక్ రికార్డు పీకే సొంతం... 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐప్యాక్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉంది. ఇటీవలి కాలంలో జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయవంతంగా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిశోర్, అతని టీం ఇచ్చిన సలహాలు సూచనలు. నిరంతరం జనాల్లో ఉండేలా అతని పాదయాత్రను డిజైన్ చేసింది వీరే. 

ప్రశాంత్ కిషోర్,  2017 లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ సింగ్, కాంగ్రెస్ కోసం వ్యూహాలతో పాటు, బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి (యు) -ఆర్జెడి-కాంగ్రెస్ ల మహాగట్ బంధన్  కోసం వ్యూహాలను రూపొందించారు. ఆ కూటమిని విచ్చిన్నం చేస్తూ, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎలో తిరిగి నితీష్ చేరిన తరువాత ప్రశాంత్ కిషోర్ కూడా జేడీయూ  పార్టీలో చేరారు.

తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కిషోర్‌ను ఠాక్రే ల వారసుడు ఆదిత్య థాకరే సంప్రదించారు. అతని ప్రచార కార్యక్రమాలను ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేసారు. ఆదిత్య ఠాక్రే జన్ ఆశిర్వాద్ యాత్ర అనేది ప్రశాంత్ కిషోర్ టీం  రూపొందించిన కీలక ప్రత్యేక ప్రణాళిక.

Also read: బెంగాల్‌లో యాక్షన్‌లోకి దిగిన పీకే: బీజేపీకి చెక్.. మమతకు పవరే టార్గెట్

ఇన్ని విజయాలున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఖాతాలో ఒక ఘోరమైన అపజయం ఉంది.  2017 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రశాంత్ కిశోరె సహాయాన్ని కోరింది. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, యుపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గౌరవప్రదమైన  సీట్లను కూడా సాధించలేకపోయింది. 

403 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లు మాత్రమే గెలుచుకోగా, బిజెపి 300 పైచిలుకు సీట్లను సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి పాత ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుకోసం సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కి హ్యాండిచ్చింది. ఫలితం అందరికి తెలిసిందే. కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క సీట్లో మాత్రమే గెలుపొందింది. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి చెందడం మనందరికీ తెలిసే ఉంటుంది. 

ఇప్పుడు, పశ్చిమ బెంగాల్‌లో బిజెపితో అమీ తుమీ  తేల్చుకునేందుకు రంకెలేస్తున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, 2021 అసెంబ్లీ ఎన్నికలకు తమా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే నియమించింది. తాజాగా ముగిసిన బెంగాల్‌ ఉప ఎన్నికలలో మూడింట మూడు స్థానాల్లోనూ టీఎంసీ పార్టీ విజయం సాధించింది. దీని వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తముందనేది జగమెరిగిన సత్యం. 

Follow Us:
Download App:
  • android
  • ios