2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేత్ర కజగం (డిఎంకె) కు సహాయం చేయడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నట్టు సమాచారం. అతని సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపిఎసి/ఐప్యాక్) ఇందుకు సంబంధించి సంతకాలు కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

ప్రశాంత్  కిషోర్ డిఎంకె అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ను సోమవారం కలుసుకున్నాడు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి, ఇరు పక్షాల భాగస్వామ్యంపై అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, వీరి మధ్య ఒప్పందం దాదాపుగా ఖరారయినట్టు డీఎంకే వర్గాల ద్వారా తెలియవస్తుంది. 

Also read: తమిళ రాజకీయాలు: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు, వెర్రెక్కీ ఉన్నోళ్లు...

2016 అసెంబ్లీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే వ్యూహకర్తగా సేవలందించిన సునీల్, గత వారం తప్పుకున్నాడు.  ఆ తరువాత డిఎంకె ప్రశాంత్ కిషోర్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. సునీల్, ప్రశాంత్ కిషోర్ ఇరువురు కలిసి ఐప్యాక్  కంటే ముందు, సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే పొలిటికల్ కంసుల్తాన్సీని స్థాపించారు. .

ప్రశాంత్ కిషోర్ బిజెపి మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) జేడీయూ, పార్టీకి ఉపాధ్యక్షుడు గా కొనసాగుతున్నాడు. 2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపికి  విజయవంతమైన లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రూపకల్పన చేసినందుకు గాను, ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా యావత్ దేశానికి సుపరిచితుడయ్యాడు.  ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతో ఏ పార్టీ అనే తేడా లేకుండా తమ సహాయ సహకారాలు కోరిన వారందరికీ అందిస్తుంది. 

విజయవంతమైన ట్రాక్ రికార్డు పీకే సొంతం... 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐప్యాక్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉంది. ఇటీవలి కాలంలో జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయవంతంగా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిశోర్, అతని టీం ఇచ్చిన సలహాలు సూచనలు. నిరంతరం జనాల్లో ఉండేలా అతని పాదయాత్రను డిజైన్ చేసింది వీరే. 

ప్రశాంత్ కిషోర్,  2017 లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ సింగ్, కాంగ్రెస్ కోసం వ్యూహాలతో పాటు, బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి (యు) -ఆర్జెడి-కాంగ్రెస్ ల మహాగట్ బంధన్  కోసం వ్యూహాలను రూపొందించారు. ఆ కూటమిని విచ్చిన్నం చేస్తూ, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎలో తిరిగి నితీష్ చేరిన తరువాత ప్రశాంత్ కిషోర్ కూడా జేడీయూ  పార్టీలో చేరారు.

తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కిషోర్‌ను ఠాక్రే ల వారసుడు ఆదిత్య థాకరే సంప్రదించారు. అతని ప్రచార కార్యక్రమాలను ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేసారు. ఆదిత్య ఠాక్రే జన్ ఆశిర్వాద్ యాత్ర అనేది ప్రశాంత్ కిషోర్ టీం  రూపొందించిన కీలక ప్రత్యేక ప్రణాళిక.

ఇన్ని విజయాలున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఖాతాలో ఒక ఘోరమైన అపజయం ఉంది.  2017 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రశాంత్ కిశోరె సహాయాన్ని కోరింది. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, యుపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గౌరవప్రదమైన  సీట్లను కూడా సాధించలేకపోయింది. 

403 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లు మాత్రమే గెలుచుకోగా, బిజెపి 300 పైచిలుకు సీట్లను సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి పాత ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుకోసం సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కి హ్యాండిచ్చింది. ఫలితం అందరికి తెలిసిందే. కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క సీట్లో మాత్రమే గెలుపొందింది. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి చెందడం మనందరికీ తెలిసే ఉంటుంది. 

ఇప్పుడు, పశ్చిమ బెంగాల్‌లో బిజెపితో అమీ తుమీ  తేల్చుకునేందుకు రంకెలేస్తున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, 2021 అసెంబ్లీ ఎన్నికలకు తమా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే నియమించింది. తాజాగా ముగిసిన బెంగాల్‌ ఉప ఎన్నికలలో మూడింట మూడు స్థానాల్లోనూ టీఎంసీ పార్టీ విజయం సాధించింది. దీని వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తముందనేది జగమెరిగిన సత్యం. 

తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ పాచికలు పారేనా...?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ కోసం సహాయం చేస్తున్న సమయంలోనే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో క్లైంట్స్ ను వెదకడం కోసం తమిళనాడులో ఒక బృందాన్ని దించాడు ప్రశాంత్ కిషోర్.  తొలుత  కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మైయం (ఎంఎన్‌ఎం) తో చర్చలు జరిపారు. అన్నాడీఎంకే తో కూడా చర్చలు జరిపారు. కమల్ హాసన్ తో ప్రయాణం ఇక ఖచ్చితం అనుకుంటున్న తరుణంలోనే అనూహ్యంగా ఈ చిగురించాల్సిన బంధం విడిపోయింది. 

సూపర్ స్టార్ కమల్ హాసన్ అక్టోబర్ నెలలో తమిళ బిగ్ బాస్ ను ఒప్పుకోవడంతో వీరి బంధం తెగిపోయింది. ఒకానొక సందర్భంలోనయితే, కమల్ హాసన్, రజినీకాంత్ ల మధ్య ప్రస్తుత పొత్తు కుదరడానికి ప్రశాంత్ కిశోరే కారణమని వార్తలొచ్చాయి కూడా. కానీ కమల్ హాసన్ తో బంధం ముగిసినతరువాత డీఎంకే రూపంలో కొత్త  క్లయింట్‌ను వెదికి పట్టడానికి పీకే కి ఎక్కువ సమయం పట్టలేదు. 

Also read: 2021లో అద్భుతం జరగబోతుందన్న రజిని మాటల్లోని ఆంతర్యం ఇదే... కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్

ఇక్కడే ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త సమస్యను ఎదుర్కొనబోతున్నారు. తమిళనాడులో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడి కులాల పరిధులు పరిమితులు తెలుగు రాష్ట్రాలకన్నా ఎక్కువ. వీటితోపాటు ద్రవిడియన్ సంస్కృతి కూడా కనబడుతుంది. 

అంతే కాకుండా ఇటు జయలలిత, అటు కరుణానిధి చనిపోయిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నిక. కాకపోతే అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం చుక్కానిలేని నావలా మారింది.

ఇది ఒకింత డీఎంకేకు కలిసివచ్చే పరిణామమే అయినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కొత్తగా రజినీకాంత్, కమల్ హాసన్ లు కలవబోతున్నారు. వీరు గనుక బలంగా ఈ ఎన్నికల్లో గనుక పోటీకి దిగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఎంతమేర తమిళ రాజకీయాలను అవపోశన పెట్టాడో, అక్కడి కుల సమీకరణాలను ఎలా అర్థం చేసుకుంటాడో వేచి చూడాలి.