త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ టీం బెంగాల్‌లో మకాం వేసింది.

వచ్చి రావడంతోనే ‘‘రాజకీయాల్లో యువత’’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతలో రాజకీయ చైతన్యం పెంచే క్రమంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రోజుకు దాదాపు 5 వేల ఈ కార్యక్రమంలో తమ పేర్లు  నమోదు చేసుకుంటున్నారు.

సెప్టెంబర్ నాటికి 5 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పీకే టీం ప్రణాళికలు రచిస్తోంది. ఈ టైనింగ్ తర్వాత యువతకు నచ్చిన పార్టీలో చేరే వీలు కల్పించనుంది. మరోవైపు తృణమూల్ కూడా ‘‘యూత్ ఇన్ పాలిటిక్స్’’ పేరిట సోషల్ మీడియాలో భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.

తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో దూకుడుగా ఉన్న బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయ్యాలని భావిస్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ 22, బీజేపీ 18 స్థానాలు గెలిచి మమత ఆధిపత్యానికి సవాల్ విసిరింది.

దీంతో తేరుకున్న మమతా బెనర్జీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకివ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌‌ను తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్నారు.

పీకే మార్గదర్శనంలో 2014లో నరేంద్రమోడీ ప్రధాని కాగా.. నితీశ్ కుమార్ బీహార్‌కు, వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ విజయాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.