గోవాలో రెండో సారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమోద్ సావంత్ మరో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పనాజీ సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలకు ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ఇటీవల నిర్వహించిన గోవా (goa) అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (bjp)ని విజయ శిఖరాలకు చేర్చిన ప్రమోద్ సావంత్ (pramod Sawant) రెండో సారి ఆ రాష్ట్ర సీఎం పీఠాన్ని ఎక్కనున్నారు. ఆయన నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (central home minister amit shah), ఇతర ముఖ్య నాయకులు హాజరవుతున్నారు.
గోవా రాజధాని అయిన పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ వేడకులకు ప్రధాని, హోం మంత్రితో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (rajnath singh), అలాగే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (jp nadda), ఇతర కేంద్ర మంత్రులు, దాదాపు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 10 వేల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది.
40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికలు జరిగాయి. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే బీజేపీ సొంతంగా 20 సీట్లు గెలుచుకుంది. అయితే అధికారం చేపట్టేందుకు 21 ఎమ్మెల్యేల బలం అసవరం. దీంతో బీజేపీకి కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు, అలాగే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్దతు ఇచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
ఈ ప్రమాణస్వీకారోత్సవం ఏర్పాటు చేయడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌లు, ఇతర సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, హోటళ్లపై గట్టి నిఘా ఉంచారు. ఈ వేడుకకు నల్లని ముసుగులు, నల్లని దుస్తులు ధరించిన వారికి ప్రవేశం లేదని ముందే పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే స్పష్టం చేశారు. “నల్ల ముసుగులు మరియు నలుపు దుస్తులు ధరించిన వ్యక్తులను వేదిక లోపలికి అనుమతించరు. అయితే ఈ వేడుకకు అందరికీ అనుమతి ఉంది’’ అని తెలిపారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా గోవాలో భద్రత కోసం 2000 మంది పోలీసులను మోహరించారు. ప్రత్యేక బృందాలు కూడా రాష్ట్రానికి చేరుకున్నాయని, కోస్ట్ గార్డ్స్, నేవీని అప్రమత్తంగా ఉంచామని గోవా డీజీపీ ఇంద్రదేవ్ శుక్లా తెలిపారు. ఈ వేడుకలను వివిధ న్యూస్ ఛానెల్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా గోవాలో సీఎంతో పాటు మరో 11 మంది వరకు కేబినేట్ మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గోవాలో రెండో సారి కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానంలో నిలిచిపోనుంది. వాస్తవానికి గోవాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. గత ఎన్నికల సమయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ అధిక స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం అయ్యింది. ఈ అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. అదే జోష్ లో రెండో సారి కూడా అధికారాన్ని నిలుపుకుంది.
