కేంద్రంపై విమర్శలు గుప్పించారు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ప్రధాని మోడీ తనను అవమానించారంటూ మండిపడ్డారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని తాను కలవకపోవడంపై రాద్ధాంతం చేయడం తనను బాధించిందన్నారు. దీనిపై పీఎంవో ఇచ్చిన ప్రకటనపై మమత అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయానికి తన ట్వీట్ ద్వారా ఘాటు కౌంటరిచ్చారు మమత.

బెంగాల్ ప్రజల కోసం ప్రధాని కోరితే ఆయన కాళ్లు పట్టుకోవడానికి సైతం సిద్ధమన్నారు. అంతేకానీ తనను అవమానించొద్దంటూ వ్యాఖ్యానించారు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ముందే నిర్ణయించుకున్నానని.. తర్వాతే మోడీ  పర్యటన ఖరారైందని దీదీ తెలిపారు. పీఎంవో తనపై మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆమె మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీససేలా ట్విట్టర్‌లో పీఎంవో పోస్టులు పెట్టిందని దీదీ ఆరోపించారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించినందుకే కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నారని.. మీ రాజకీయ వేధింపులు ఆపాలంటూ మమత ఫైరయ్యారు. 

Also Read:యాస్‌పై సమీక్ష: మమత కోసం మోడీ నిరీక్షణ, అరగంట లేట్.. మళ్లీ క్షణాల్లో వెళ్లిపోయిన దీదీ

కాగా, యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చి వెంటనే వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు అరగంట పాటు సీఎం మమత కోసం ప్రధాని మోడీ ఎదురుచూశారు. ఆ తర్వాత ఆమె వచ్చినప్పటికీ.. కాసేపటికే దీదీ వెళ్లిపోయారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివరణ కూడా ఇచ్చారు.

యాస్ తుఫాన్ సమీక్షా సమావేశం మోడీతో వున్న విషయం తనకు తెలియదని.. అదే సమయంలో మరో చోట అధికారులతో కీలక సమావేశం ముందే ఫిక్సయ్యిందన్నారు. దీంతో ప్రధాని మోడీకి తుపాను నష్టంపై ముందే నివేదిక సమర్పించానన్నారు. 20 వేల కోట్ల సాయం కావాలని అడిగినట్లు మమత చెప్పారు. అధికారులతో కీలక సమావేశం వుందని.. ప్రధానికి చెప్పానని, మోడీ అనుమతి తీసుకునే ఆ సమీక్ష నుంచి నిష్క్రమించినట్లు సీఎం తెలిపారు.