నేడు 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. రూట్స్ ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రోజున దేశంలోని వివిధ మార్గాల్లో తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రోజున దేశంలోని వివిధ మార్గాల్లో తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ తొమ్మిది వందేభారత్ రైళ్లు 11 రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచనున్నాయి. అందులో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ వందే భారత్ రైళ్లు వేగవంతమైన రైళ్లగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ మార్గాల్లో ప్రయాణీకుల సమయాన్ని గణనీయంగా ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి.
Also Read: హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ- చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు.. వచ్చే వారమే ప్రారంభం..
ఈరోజు ప్రారంభించే వందేభారత్ రైళ్ల వివరాలు..
1. కేరళ.. కాసరగోడ్-తిరువనంతపురం
2. రాజస్థాన్.. జైపూర్-ఉదయ్‌పూర్
3. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. విజయవాడ-చెన్నై
4. తమిళనాడు.. తిరునెల్వేలి-చెన్నై
5. గుజరాత్.. జామ్‌నగర్-అహ్మదాబాద్
6. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్.. రాంచీ-హౌరా
7. తెలంగాణ, కర్ణాటక.. హైదరాబాద్ (కాచిగూడ)-బెంగళూరు (యశ్వంతపూర్)
8. ఒడిషా.. రూర్కెలా-పూరి
9. బీహార్, పశ్చిమ బెంగాల్.. పాట్నా-హౌరా
రూర్కెలా- భువనేశ్వర్ - పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆయా మార్గాల్లో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయాన్ని దాదాపు 3 గంటల వరకు తగ్గించనున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో 2.5 గంటలకు పైగా సమయాన్ని ఆదా చేయనుంది.