హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ- చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు.. వచ్చే వారమే ప్రారంభం..
విజయవాడ-చెన్నైల మధ్య, హైదరాబాద్-బెంగళూరుల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారు అయింది.
హైదరాబాద్: విజయవాడ-చెన్నైల మధ్య, హైదరాబాద్-బెంగళూరుల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారు అయింది. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గాప్రారంభించారు. ఆ జాబితాలో కాచిగూడ(హైదరాబాద్)- యశ్వంతపూర్(బెంగళూరు), విజయవాడ-చెన్నై వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారని.. మరుసటి రోజు(సెప్టెంబర్ 25) నుంచి ఈ రైలు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు నగరాల మధ్య దూరాన్ని 609 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది.
రైలు నెంబర్ 20703 కాచిగూడ - యశ్వంత్‌పూర్.. కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 20704 యశ్వంత్‌పూర్ - కాచిగూడ.. యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. ఈ వందేభారత్ రైలుకు.. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌లలో స్టాప్‌లు ఉండనున్నాయి.
మరోవైపు విజయవాడ-చెన్నై వందేభారత్ రైలును కూడా ప్రధాని మోదీ ఈ నెల 24న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు బుధవారం తెలిపారు.
ఇక, ఈ రైలు మంగళవారం మినహా వారంలో అన్ని రోజులు నడపబడుతుంది. విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి..రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఈ వందేభారత్ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో స్టాప్‌లుఉన్నాయి. రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త వందే భారత్ రైళ్లలో ప్రయాణీకుల మెరుగైన సౌకర్యాల కోసం అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే.