Assembly Election 2022:ఎన్నికలే లక్ష్యం.. ఈ నెల 30న ఉత్తరాఖండ్ లో ప్రధాని మోడీ పర్యటన
Assembly Election 2022: వచ్చే ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వెస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈ నెల 30న ఉత్తరాఖండ్ లో రూ.17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Assembly Election 2022: వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి-మార్చి నెలల్లో దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే మొదలు పెట్టాయి. ఇతర రాజకీయా పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు సాగుతున్నాయి. బీజేపీ సైతం తనదైన ప్రణాళికలతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను తమవైపు తిప్పుకునే విధంగా ముందుకు సాగడంలో ఎన్నికల ఎజెండా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తూ పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కొత్త వాటికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. డిసెంబర్ 30న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీని సందర్శించనున్న ప్రధాని మోడీ.. ఈ పర్యటనలో భాగంగా రూ.17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
Also Read: coronavirus: ఒమిక్రాన్ ఇమ్యూనిటీతో డెల్టాకు చెక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు !
హల్ద్వానీని సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లో రూ.17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం 23 ప్రాజెక్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల, రోడ్లు, గృహాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాలకు ఉపయోగపడనున్న రూ.14,100 కోట్లకుపైగా విలువైన 17 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, బహుళ రహదారి విస్తరణ ప్రాజెక్టులు, పితోర్‌ఘర్‌లో జల విద్యుత్ ప్రాజెక్టు, నైనిటాల్‌లోని మురుగు నీటి నెట్‌వర్క్‌ను మెరుగు పర్చడానికి సంబంధించిన ప్రాజెక్టులతో సహా 6 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం జరగనుంది. ఆయ ప్రాజెక్టుల వ్యయం 3400 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, 1976లో నిర్మాణం కోసం ప్రణాళికలు వేసిన లఖ్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్టు చాలా సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. దాదాపు 5750 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
Also Read: Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు !
జాతీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన లఖ్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ద్వారా సుమారు 34,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తుంది. అలాగే, 300 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు తాగునీరు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రాజెక్టు. రూ. 4000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 85 కిలోమీటర్ల మొరాదాబాద్-కాశీపూర్ నాలుగు లైన్ల రహదారికి కూడా శంకుస్థాపన చేయన్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా రహదారి నిర్మాణ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రూ.625 కోట్లకుపైగా వ్యయంతో కూడిన మొత్తం 1157 కిలోమీటర్ల పొడవునా 133 గ్రామీణ రహదారులు ఉన్నాయి. అలాగే, దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో 151 వంతెనల నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్తరఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రారంభించనున్న మరో కీలకమైనది నీటి సరఫరా పథకాలు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి సరఫరాను మెరుగుపర్చడానికి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 73 నీటి సరఫరా పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
Also Read: Dengue: ఢిల్లీపై డెంగ్యూ పంజా.. 9500 కేసులు, 23 మరణాలు !