ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాతృవియోగం.. తుదిశ్వాస విడిచిన తల్లి హీరాబెన్ మోడీ
ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి హీరాబెన్ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఆమె వయసు 99. "శ్రీమతి హీరాబా మోడీ 30/12/2022న తెల్లవారుజామున 3:39 గంటలకు (ఉదయం) యుఎన్ మెహతా హార్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు" అని ఈ మేరకు ఆ ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె బుధవారం నుండి ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
హీరాబెన్ గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసించేవారు. ప్రధానమంత్రి తన గుజరాత్ పర్యటనలలో ఎక్కువ భాగం రేసాన్‌ను సందర్శించడంతోపాటు తన తల్లితో సమయాన్ని గడిపేవారు.
"ఒక అద్భుతమైన శతాబ్ది భగవంతుని పాదాల చెంతకు చేరింది. అమ్మలో నేను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఒక సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి ఉండే జీవితానికి ప్రతీక ఆమె’’ అని ప్రధాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ హృదయపూర్వక నివాళులు అర్పించారు.
ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా ఓ బ్లాగ్ రాశారు. అందులో ముఖ్యంగా.. ప్రధాని తన తల్లి జీవితంలోని వివిధ అంశాల గురించి రాశారు. ఇది "తన మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పొందేలా చేసింది" అని రాశారు.
"ఈ యేడు ఆమె జన్మ శతాబ్ది సంవత్సరం అవ్వనుంది. మా నాన్న జీవించి ఉంటే, తను కూడా గతవారం 100వ పుట్టినరోజును జరుపుకునేవారు. 2022 మా అమ్మ శతజయంతి సంవత్సరం ప్రారంభమవుతున్నందున, మా నాన్నగారికి వందేళ్లు పూర్తయ్యేవి" అని తన బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తనతో పోల్చితే తన తల్లి బాల్యం చాలా కష్టతరమైనదని, తన చాలా చిన్నతనంలోనే ఆమె తన తల్లిని కోల్పోయిందని, అది తనను బాధిస్తూనే ఉందని ప్రధాని బ్లాగ్‌లో పేర్కొన్నారు. "ఇల్లు గడవడం కోసం మా అమ్మ ఇళ్లలో అంట్లు కడిగేవారు. ఆ కొద్దిపాటి డబ్బులు మాకు సరిపోకపోవడంతో... మిగతా సమయాల్లో అమ్మ చరఖాను తిప్పేది" అని ప్రధాన మంత్రి కుటుంబ కష్టాల ప్రారంభ రోజులను వివరిస్తూ రాశారు.
"నేను ఆమెను చూడడానికి గాంధీనగర్‌కు వెళ్ళినప్పుడల్లా, ఆమె తన చేతులతో నాకు స్వీట్లు ఇస్తుంది. మేము ఎంత పెద్దవాళ్లమైనా ఆమెకు చిన్నపిల్లలమే.. అందుకే మేము తినడం పూర్తి కాగానే కర్చీప్ తో మూతి తుడుస్తుంది. ఆమె దగ్గర ఎప్పుడూ ఒక రుమాలు లేదా చిన్న టవల్ ఉంటుంది. అది ఆమె చీరలో దోపుకుంటుంది" అని ప్రధాన మంత్రి తన తల్లికి పరిశుభ్రతపై ఉన్న దృష్టిని నొక్కిచెబుతూ...ఇంకా ఇలా అన్నారు.. "మంచం ఎప్పుడూ శుభ్రంగా, సరిగా సర్ది ఉంటుంది..’ అదే ఆమె ప్రత్యేకత" అని జోడించారు.