G20 Summit 2023 : జో బైడెన్‌తో నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు.. ఎజెండా ఏమిటంటే..?
జీ20 దేశాధినేత శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తున్నారు . క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, హై-టెక్నాలజీతో సహా వివిధ కీలక రంగాలపై వీరిద్దరూ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జీ20 దేశాధినేత శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ప్రధాని నివాసానికి చేరుకున్న బైడెన్‌కు మోడీ ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం తన నివాసాన్ని చూపించారు మోడీ. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
ద్వైపాక్షిక సమావేశంలో వాతావరణ మార్పు, ఆర్థిక సహకారం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు సంస్కరణల ఎజెండాపై ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బిడెన్‌లు చర్చిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. చర్చల్లో ప్రముఖంగా కనిపించే మరో అంశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.
వార్తా సంస్థ PTI ప్రకారం.. క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, హై-టెక్నాలజీతో సహా వివిధ కీలక రంగాలలో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడంపై ప్రధాని మోదీ - ప్రెసిడెంట్ బిడెన్ మధ్య చర్చ సాగవచ్చని తెలుస్తోంది. అలాగే.. డ్రోన్ డీల్, జెట్ ఇంజన్ డీల్ పై చర్చించే అవకాశం ఉంది. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లపై సాధ్యమయ్యే అణు ఒప్పందం, డ్రోన్ ఒప్పందం, జెట్ ఇంజిన్‌లపై రక్షణ ఒప్పందానికి యుఎస్ కాంగ్రెస్ ఆమోదం పురోగతి, ఉక్రెయిన్‌కు ఉమ్మడి సహాయం, వీసాల సమస్య లపై చర్చించనుట్లు తెలుస్తోంది.
ఇకపోతే.. జి-20 సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అంతర్జాతీయ చట్టం సూత్రాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి న్యాయమైన, మన్నికైన శాంతిని నెలకొల్పేందుకు జి-20 సదస్సులో అధ్యక్షుడు బిడెన్ పిలుపునిస్తారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు. ఈ సూత్రాలకు కట్టుబడి ఉక్రెయిన్‌కు అవసరమైనంత కాలం అమెరికా మద్దతు కొనసాగిస్తుందని అధ్యక్షుడు నొక్కి చెబుతూనే ఉన్నారు.
అంతకుముందు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు బైడెన్. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, పలువురు అధికారులు జో బైడెన్‌కు ఘనస్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భేటీ ముగిసిన అనంతరం బైడెన్‌కు తన అధికారిక నివాసంలో ప్రైవేట్‌గా డిన్నర్ ఇవ్వనున్నారు మోడీ.
జీ 20 సమావేశాలు జరిగినన్ని రోజులు జో బైడెన్ ఢిల్లీలోని అత్యంత ఖరీదైన హోటల్ ఐటీసీ మౌర్య షెరటన్‌లో బస చేస్తారు. ఇందులో మొత్తం 400 గదులు వుంటాయి. బైడెన్ భద్రత దృష్ట్యా.. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఈ హోటల్‌లోని అన్ని గదులను 3 రోజుల పాటు బుక్ చేసింది. మీడియా కథనాలను బట్టి బైడెన్ ఈ హోటల్‌లోని 14వ అంతస్తులో వుంటారు. ఇక్కడ సకల సౌకర్యాలు వున్న ప్రెసిడెన్షియల్ సూట్ ‘చాణక్య’లో బైడెన్ బస చేస్తారు. ఆయనను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకెళ్లడానికి సీక్రెట్ సర్వీస్ ప్రత్యేకంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది.