స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 13 నుంచి 15 వరకు ‘‘హార్ ఘర్ తిరంగా’’ ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జాతికి పిలుపునిచ్చారు.  ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకంతో భావోద్వేగ అనుబంధం వుందని మోడీ అన్నారు. 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 13 నుంచి 15 వరకు ‘‘హార్ ఘర్ తిరంగా’’ ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జాతికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భారత జెండా స్వేచ్ఛ, జాతీయ ఐక్యతకు ప్రతీక అన్నారు. భారతీయులు తమ ఫోటోలను హార్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకంతో భావోద్వేగ అనుబంధం వుందని.. ఇది దేశ ప్రగతికి మరింత కష్టపడి పనిచేయడానికి మాకు స్పూర్తినిస్తుందని మోడీ పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఆగస్ట్ 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో దేశ ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాని.. త్రివర్ణ పతాకంతో వున్న మీ ఫోటోలను ఇక్కడ అప్‌లోడ్ చేయాలంటూ ‘‘https://harghartiranga.com ’’ వెబ్‌సైట్ వివరాలు ఇచ్చారు. ప్రధాని పిలుపుకు దేశ ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 6,14,54,052 సెల్ఫీలు సమర్పించినట్లు వెబ్‌సైట్ పేర్కొంది. ఫ్లాగ్‌తో సెల్ఫీలను అప్‌లోడ్ చేసే ఆప్షన్ ద్వారా డిజిటల్ తిరంగా ఆర్ట్‌‌లో ఫీచర్ పొందొచ్చని వెబ్‌సైట్ తెలిపింది. 

కాగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది జూలై 22న హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ జెండాకు ఆ తేదీకి చారిత్రక ప్రాముఖ్యత వుందన్నారు. తాజాగా ఈ ఏడాది కూడా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇది జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్యాంపెయిన్ దేశంలోని పౌరులందరినీ వారి ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయమని ప్రోత్సహిస్తుంది. రెండవ ఎడిషన్ కూడా మునుపటి ఏడాది మాదిరిగానే ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకు జరుపుకుంటున్నారు. 

ఇకపోతే.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ప్రచారం రెండవ ఎడిషన్ ర్యాలీని ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌కఢ్ జెండా ఊపి ప్రారంభించారు. మథుర రోడ్, బైరాన్ రోడ్, ఇండియా గేట్, ప్రగతి మైదాన్ సొరంగం మీదుగా ఈ ర్యాలీ సాగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ రైడ్ చేస్తుండగా.. మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చేతిలో భారత జాతీయ పతాకాన్ని పట్టుకుని వెనుక కూర్చొన్నారు. ర్యాలీ సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలు మిన్నంటాయి.