ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు 12 వెబ్‌నార్లలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా రేపు గ్రీన్ గ్రోత్‌పై ఏర్పాటు చేసిన పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ వెబ్‌నార్‌ను కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 23న ఉదయం పది గంటలకు గ్రీన్ గ్రోత్‌పై ఏర్పాటు చేసిన పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌లో ప్రసంగించనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఆలోచనలు, సూచనలను కోరేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెబ్‌నార్లను నిర్వహిస్తుండగా.. ఇందులో ఇది మొదటిది. వెబ్‌నార్‌లో గ్రీన్ గ్రోత్ శక్తి, నాన్ ఎనర్జీ భాగాలు రెండింటినీ కవర్ చేసేందుకు ఆరు బ్రేక్ అవుట్ సెషన్‌లు వుంటాయి. ఈ వెబ్‌నార్‌ను కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, కార్యదర్శులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు , పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు హాజరవుతారు. బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకటనలను మెరుగ్గా అమలు చేయడానికి సూచనలు ఇస్తారు.
దేశంలో గ్రీన్ ఇండస్ట్రీస్, ఆర్ధిక పరివర్తన, పర్యావరణ అనుకూల వ్యవసాయం, స్థిరమైన ఇంధనం తీసుకురావడానికి కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రతిపాదించిన ఏడు ప్రాధాన్యతలలో గ్రీన్ గ్రోత్ ఒకటి. ఇది దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. అలాగే బడ్జెట్‌లో పలు రంగాలు, మంత్రిత్వ శాఖలలో సూచించిన పలు కార్యక్రమాలను ప్రస్తావించింది. ఇందులో గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు, రెన్యూవబుల్ ఎనర్జీ ఇవాక్యూయేషన్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, పీఎం-ప్రాణం, గోబర్ధన్ స్కీమ్, భారతీయ ప్రకృతి ఖేతి బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్లు, MISHTI, అమృత్ ధరోహర్, కోస్టల్ షిప్పింగ్ అండ్ వెహికల్ ప్రోగ్రామ్‌లు వున్నాయి.
Also REad: 12 పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్లలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే
ప్రతి పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్ మూడు సెషన్‌లను కలిగి వుంటుంది. ప్రధాని ప్రసంగించే ప్లీనరీ ఓపెనింగ్ సెషన్‌తో ఇది ప్రారంభమవుతుంది. ఈ సెషన్ తర్వాత సమాంతరంగా జరిగే వివిధ థీమ్‌లపై ప్రత్యేక బ్రేక్ అవుట్ సెషన్‌లు వుంటాయి. చివరిగా బ్రేక్ అవుట్ సెషన్‌లో చర్చించుకున్న ఆలోచనల్ని ప్లీనరీ ముగింపు సెషన్‌లో ప్రదర్శిస్తారు. వెబ్‌నార్ సమయంలో అందిన ఇన్‌పుట్‌ల ఆధారంగా బడ్జెట్ ప్రకటనల అమలు కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు సమయానుకూలంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తాయి.
ఇకపోతే.. ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 మధ్య నిర్వహించబడే మొత్తం 12 పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వెబ్‌నార్లను వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలిసి కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించిన ‘‘సప్తరుషి’’ ప్రాధాన్యతలను వివరించనున్నాయి.
