శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 1 గంటకు బాదల్ గ్రామంలో నిర్వహించనున్నారు.
అనారోగ్యంతో కన్నుమూసిన శిరోమణి అకాలీదళ్ అగ్రనేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం చండీగఢ్‌కు చేరుకున్న ప్రధాని మోడీ.. బాదల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఇకపోతే.. ప్రకాశ్ సింగ్ బాదల్ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 1 గంటకు బాదల్ గ్రామంలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ ప్రధాన కార్యాలయంలో ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం వుంచుతారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నదనే కారణంతో ఆయనను మొహలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వారం క్రితం చేర్చారు. ఆ ఫోర్టిస్ హాస్పిటల్‌లోనే ఆయనకు చికిత్స అందించారు. కాగా, మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితులు విషమించి మరణించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బాదల్ మరణించినట్టు హాస్పిటల్ డైరెక్టర్ అభిజీత్ సింగ్ పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఆయన మరణానికి నివాళులు అర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26, 27వ తేదీ (నేడు, రేపు)ల్లో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని పేర్కొంది. క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేస్తామని, ఈ రెండు రోజులు ఎలాంటి అధికారిక వినోదం ఉండదని తెలిపింది.
ALso Read: పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత.. రాజనీతిజ్ఞుడంటూ ప్రధాని మోడీ నివాళులు
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, మరణాన్ని ఆయన కుమారుడు, ఎస్ఏడీ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత సహాయకుడు ధృవీకరించారు. భటిండాలోని బాదల్ గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపార. కాగా ప్రకాశ్ సింగ్ బాదల్ 1970-71, 1977-80, 2007-2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య సురీందర్ కౌర్ బాదల్, కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, కోడలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు.
పంజాబ్ రాష్ట్రానికి పిన్న వయసులోనే సీఎం బాధ్యతలు చేపట్టిన నేతగా ప్రకాశ్ సింగ్ బాదల్‌కు రికార్డు ఉన్నది. 43 ఏళ్ల వయసులోనే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని పంజాబ్‌కు చెందిన అబుల్ ఖురానాలో జన్మించారు. గ్రామ సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో అంటే ఆయన 30 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఎన్నికలకు తొలిసారి పోటీ చేశారు.
కాగా.. 2015లో ఆయనకు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు లభించింది. అయితే రెండు సంవత్సరాల కిందట పంజాబ్ రైతులు మహా ఆందోళనల చేపట్టినప్పుడు, వారిని కేంద్ర ప్రభుత్వం సరిగా ట్రీట్ చేయడం లేదనే కారణంతో నిరసనగా ఆయన తన పద్మ విభూషణ్ అవార్డును వెనక్కిచ్చేశారు.
