పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి 8 గంటలకు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఊపిరితీసుకోవడం ఇబ్బందిగా మారిందనే సమస్యతో మొహలీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఆయన వారం క్రితం చేరారు. 95వ యేటా తుదిశ్వాస విడిచారు.
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం, అకాలీ దళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. పంజాబ్ రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ బాదల్ తన 95వ యేటా తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నదనే కారణంతో ఆయనను మొహలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వారం క్రితం చేర్చారు. ఆ ఫోర్టిస్ హాస్పిటల్‌లోనే ఆయనకు చికిత్స అందించారు. కాగా, మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితులు విషమించి మరణించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బాదల్ మరణించినట్టు హాస్పిటల్ డైరెక్టర్ అభిజీత్ సింగ్ పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
పంజాబ్ రాష్ట్రానికి పిన్న వయసులోనే సీఎం బాధ్యతలు చేపట్టిన నేతగా ప్రకాశ్ సింగ్ బాదల్‌కు రికార్డు ఉన్నది. 43 ఏళ్ల వయసులోనే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని పంజాబ్‌కు చెందిన అబుల్ ఖురానాలో జన్మించారు. గ్రామ సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో అంటే ఆయన 30 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఎన్నికలకు తొలిసారి పోటీ చేశారు.
Also Read: భారతదేశపు తొలి గ్రామం 'మనా' గురించిన ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
పంజాబ్ రైతులు మహా ఆందోళనల చేపట్టినప్పుడు, వారిని కేంద్ర ప్రభుత్వం సరిగా ట్రీట్ చేయడం లేదనే కారణంతో నిరసనగా ఆయన తన పద్మ విభూషణ్ అవార్డును వెనక్కిచ్చేశారు. 2015లో ఆయనకు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేశారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ మరణంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం తనను కలతపరిచిందని వివరించారు. దేశ రాజకీయాల్లో ఆయన బ్రహ్మాండమైన నేత అని, దేశానికి ఎంతో సేవ చేసిన రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు. పంజాబ్ పురోగతి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి, క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపిన నేత అని గుర్తు చేసుకున్నారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం తనకు వ్యక్తిగత నష్టం అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా దిగ్విజయ నేత అని వివరించారు.
