గుజరాతీయులు బీజేపీ వైపే.. హిమాచల్‌లో ఒక్క శాతం ఓట్లతోనే ఓటమి : మోడీ
గుజరాత్‌లో వరుసగా ఏడోసారి అధికారాన్ని అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తోందని.. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేశాయని మోడీ అన్నారు

గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని ప్రజలు నిరూపించారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వరుసగా ఏడోసారి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో వేడుకల్లో పాల్గొననారు మోడీ. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేశాయని మోడీ అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే గుజరాత్‌లో మరోసారి గెలిచామని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో బీజేపీ విజయం సాధించిందని ప్రధాని వెల్లడించారు. బీహార్ ఉపఎన్నికల్లోనూ పార్టీ అద్భుత ప్రదర్శన చేసిందని.. ఇది ఆ రాష్ట్రంలో బీజేపీ విజయ సంకేతానికి చిహ్నామన్నారు. ఒక్క పోలింగ్ కేంద్రంలోనూ రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాలేదని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన అభినందనలు తెలిపారు. తక్కువ ఓట్ల శాతంతో గెలుపోటములు గతంలో ఎప్పుడూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిందన్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపై వ్యతిరేకత పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:గత రికార్డులను బద్దలు కొడుతూ.. అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ.. కలిసొచ్చిన అంశాలేంటీ?
ఇదిలావుండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. 2017 ఎన్నికల కంటే 57 సీట్లు అధికంగా గెలుచుకొని బంపర్ విక్టరీని కైవసం చేసుకుంది. ఈ సారి గుజరాత్‌లో బీజేపీ-కాంగ్రెస్- ఆప్ ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని, గతంలో కంటే.. బీజేపీకి సీట్లు పడిపోవచ్చని విశ్లేషకులు భావించారు. కానీ..మోడీ చరిష్మా ముందు ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయి. ప్రధానంగా దూకుడు వ్యవహరించిన ఆప్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేవలం 5 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అఖండ విజయంలో ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కొన్నైతే.. దూకుడుగా వ్యవహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మరింత నష్టం వాటిల్లింది.