ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. దాదాపు 3 గంటలకు ఈ భేటీ జరుగుతోంది. కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహాగానాల మధ్య వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమైన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు , పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త టీమ్‌తో మోడీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, కూడికలు, తీసివేతల ఆధారంగా కొత్త వారికి, సమర్ధులకు కేబినెట్‌లో స్థానం కల్పించాలని మోడీ సంకల్పించారు. దీనిలో భాగంగా గత కొద్దిరోజులుగా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ కూడా ప్రధాని అధికారిక నివాసంలో వీరు ముగ్గురు సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలుగా ఈ భేటీ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ శని, ఆదివారాల్లోనే మంత్రివర్గ విస్తరణ వుండే అవకాశం వుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.,
మరోవైపు.. విపక్షాల సమావేశాలకి కౌంటర్‌గా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల బల ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 18న సమావేశానికి పిలుపు నిచ్చింది. అంతేకాదు.. గతంలో ఎన్డీయేను వీడి వెళ్లిన పార్టీలకు కూడా ఆహ్వానం పలకాలని కమలనాథులు భావిస్తున్నారు. అదే జరిగితే శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, తెలగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఈ సమావేశం జరగనుంది.
Also Read: బీజేపీ మినీ జమిలి వ్యూహం.. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో అందుకే సన్నిహితం?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా గత నెలలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్‌బందన్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆయన ఎన్‌డీఏలో చేరారు. ఈ పరిణామాలతో బీజేపీకి బూస్ట్ వచ్చింది. అలాగే మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు , ఎన్‌సీపీలోని ఒక వర్గం బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరడంతో పాటు కర్ణాటకలోని జేడీఎస్, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకునే అవకాశం వుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చంద్రబాబు బీజేపీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎన్డీయేలోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం పాలవ్వడంతో తిరిగి బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు భావించారు. అయితే ఆయనను కమలనాథులు దగ్గరకి రానివ్వడం లేదు. కానీ కర్ణాటక ఎన్నికలు, విపక్షాలు ఏకతాటిపైకి వస్తుండటంతో బీజేపీ వైఖరిలో మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్డీయే సమావేశానికి టీడీపీ, అకాలీదళ్‌లకు కూడా ఆహ్వానాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
