బీజేపీ జాతీయ స్థాయిలో తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండటం గమనార్హం. దీనికి తోడు బీజేపీ ఒక మినీ జమిలి ఎన్నికలకు వ్యూహం రచించినట్టు, దాని అమలుకు అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. 

హైదరాబాద్: జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చాలా కాలంగా అనుకుంటున్నది. ఈ అంశంపై పలుమార్లు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. నిర్వహణ వ్యయం, అధికారయంత్రాంగంపై భారం తగ్గించి, పాలనకు ఎక్కువ కాలం కేటాయించడం వంటి విషయాలు చెబుతూ జమిలి ఎన్నికలు నిర్వహించడం అవసరం అని బీజేపీ నేతలు వాదించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు, మరికొన్ని నెలల్లోనే లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ఉండటంతో జమిలి ఎన్నికలపై చర్చ మరోసారి మొదలైంది. జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని ఆరాటపడుతున్న బీజేపీ వ్యూహాత్మకంగానే తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో సన్నిహితంగా మసులుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో ముందస్తుగా జరిగాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్టు మీడియాలో లీకులు వచ్చాయి. కాదు.. కాదు.. బీజేపీ నేతలు ఈ ప్రతిపాదనను జగన్ ముందు పెట్టారనే రెండో వైపు వాదనలూ వచ్చాయి. కొన్నాళ్లుగా ఏపీలో ముందస్తుపై చర్చలు జోరందుకోగా.. ఇప్పుడు మోడీ, జగన్ భేటీ తర్వాత ఇలాంటి లీకులు మీడియాకు రావడం ఒక క్రమబద్ధమైన ప్రణాళికలో భాగమే అనే మరో చర్చ మొదలైంది.

విపక్షాల పట్నా భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారపార్టీలు బీఆర్ఎస్, వైసీపీలు హాజరు కాలేదు. ఆ భేటీ తర్వాత బీజేపీ పంథా మార్చుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే బీజేపీకి, ఈ రెండు పార్టీల మధ్య మాటలయుద్ధంలో వాడి తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. మూడోసారి కచ్చితంగా కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న బీజేపీకి ఈ రెండు పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు లేకపోలేవు. దీనికి తోడు దీర్ఘకాలంగా వాదిస్తున్న జమిలి ఎన్నికలు బీజేపీ ప్రణాళిక కూడా.

Also Read: తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ అలోక్ అరదే!

ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కి అసెంబ్లీ ఎన్నికలకూ షెడ్యూల్ ఉన్నది. 2024 చివరిలో మరో మూడు రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఏడాది వ్యవధిలోనే 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో ఏడు పెద్ద రాష్ట్రాలున్నాయి. వీటిలో ఎంపీ సీట్లు బీజేపీకి చాలా ముఖ్యం.

అందుకే లోక్ సభ ఎన్నికలను కొన్ని నెలలు ముందుకు జరిపితే.. ఎన్నికల సంఘం కూడా అనుకూలంగా కలిసి వస్తే లోక్ సభ ఎన్నికలతోపాటే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. 2024 చివరిలో జరిగే మూడు రాష్ట్రాల్లో హర్యానా, మహారాష్ట్రల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటికి కూడా వాటితోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. ఒక వేళ విపక్ష శిబిరమైన జేఎంఎం కూడా ఇందుకు సై అంటే.. బీజేపీ ఒక మినీ జమిలి ఎన్నికల కలను సాకారం చేసుకున్నట్టే. సాధారణంగా బీజేపీకి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కంటే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు సానుకూలంగా ఉంటున్నారు. బీజేపీ కూడా లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. లోక్ సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. రాష్ట్రాల్లో విపక్షాలు నెట్టుకురావడం కష్టమని విశ్లేషకులు చెబుతుంటారు. అసలు వ్యూహమేంటనేది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.