ఆరంభం అమిత్ షా... ముగింపు మోదీ..: పాదయాత్రపై అన్నామలై ఎమోషనల్ పోస్ట్
తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన "ఎన్ మన్, ఎన్ మక్కల్'' పాదయాత్ర ముగిసింది. ఈ ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడులో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర ముగింపు నేపథ్యంలో ఏర్పాటుచేసిన బారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఇందుకోసం తిరుపూరు చేరుకున్న ప్రధాని రోడ్ షో చేపట్టారు. దారిపొడవునా ఎదురుచూస్తున్న ప్రజలు, బిజెపి శ్రేణులకు అభివాదం చేస్తూ సభాస్థలికి చేరుకున్నారు ప్రధాని.
తన పాదయాత్రను రామేశ్వరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారని... ఇప్పుడు ప్రధాని మోదీ సమక్షంలో ముగించారని అన్నామలై తెలిపారు. విజయవంతంగా 234 నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగిసిందని... ఈ క్రమంలో ప్రధాని మోదీపై తమిళ ప్రజల్లో ఎంతటి అభిమానం వుందో చూసానన్నారు.
తన వందరోజుల పాదయాత్రకు సంబంధించిన కీలక పరిణామాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టారు అన్నామలై. "ఎన్ మన్, ఎన్ మక్కల్'' (నా భూమి, నా ప్రజలు) పాదయాత్ర తన జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నామలై పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించి మరోసారి ప్రధానిని చేయాలని అన్నామలై కోరారు.
Also Read జర్మన్ మహిళ పాటను ఆస్వాదిస్తూ.. దరువేసిన ప్రధాని మోడీ...
అన్నామలై పాదయాత్ర ముగింపు సభలో ప్రధాని మోదీ కూడా తమిళ ప్రజలతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడుతో తనకు దశాబ్దాలుగా మంచి సంబంధాలు వున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ బిజెపి అధికారంలో లేకున్న తమ గుండెల్లో ఎప్పుడూ వుంటుందన్నారు.