కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై నిరసన జ్వాలల సెగ ఢిల్లీని తాకింది. దక్షిణ ఢిల్లీలోని ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్(డీటీసీ)కి చెందిన రెండు బస్సులకు నిప్పంటించారు.

Also Read:పౌరసత్వ సవరణ చట్టం.. ‘టీ’ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి

ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుంటుండగా ఓ ఫైరింజిన్‌ను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డుకుని ధ్వంసం చేశారు. ఫైరింజన్‌ను దగ్థం చేసిన ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో సరితా విహార్‌కు వెళ్లే ఓఖ్లా అండర్‌పాస్‌పై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

Also Read:ఈశాన్య భారతంలో బీజేపీకి మరో షాక్

ప్రస్తుతం దక్షిణ ఢిల్లీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు నాలుగు మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. మరోవైపు ఈ ఘటనలో తమకు సంబంధం లేదని, స్థానికులే ఇందులో పాల్గొన్నారని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్ధి సంఘం ప్రకటించింది.

ఈ సంఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. నిరసనలు శాంతియుతంగానే ఉండాలి కానీ హింసాత్మక ఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు.