రేపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ట్రైన్‌లో ప్రయాణించడానికి టికెట్ ధరలు, దాని టైమింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని కలుపుతుంది. సికింద్రాబాద్‌లో మొదలై నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌ల మీదుగా ఈ ట్రైన్ తిరుపతికి చేరుతుంది. పైన పేర్కొన్న చోట్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగుతుంది. ఈ ట్రైన్ గురించిన ప్రత్యేకతలు, టికెట్ ధరలు, టైమింగ్స్ వివరాలు చూద్దాం.
ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ ప్రస్తుత సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కంటే కూడా వేగంగా ప్రయాణిస్తుంది. స్వల్ప కాలంలో గమ్యాన్ని చేరుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్ సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది. అదే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 8.30 గంటలు ప్రయాణిస్తుంది. గంటకు 77 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ వందే భారత్ ట్రైన్ ఎనిమిది కోచ్‌లతో ప్రారంభమైంది. ఒక ఎగ్జిక్యూటివ్ కోచ్, ఏడు చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్ ఖరీదైనది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లడానికి నిత్యం ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు సేవలు అందిస్తుంది. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (20701) ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ ట్రైన్ (20702) బయల్దేరుతుంది. రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
ఈ మార్గంలో టికెట్ల ధరలను ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ముందుగా చైర్ కార్ టికెట్ రేట్లు చూద్దాం. సికింద్రాబాద్ నుంచి నల్గొండకు రూ. 470, గుంటూరుకు రూ. 865, ఓంగోలుకు రూ. 1075, నెల్లూరుకు రూ. 1270గా టికెట్ రేట్లు ఉన్నాయి. అదే సికింద్రాబాద్ నుంచి చివరి స్టేజీ తిరుపతికి రూ. 1680 ధరగా ఉన్నది.
ఇక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి నల్గొండకు రూ. 900, గుంటూరుకు రూ. 1620, ఒంగోలుకు రూ. 2045, నెల్లూరుకు రూ. 2455గా ఉన్నది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రూ. 3080గా టికెట్ ధర ఉన్నది.
