US India Tariff: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా సుంకాల పెంపు నిర్ణయాల నేపథ్యంలో భారత ప్రధాని నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై, ఎగుమతులపై పడే ప్రభావాన్ని సమీక్షించనున్నారు.

PM Modi : భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే విధంగా అమెరికా అధ్యక్షుడు భారీగా సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా భారత ఎగుమతులపై విధించిన ఈ పెరిగిన సుంకాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్ వ్యూహరచనను రూపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోనున్నారట. 

ఈ నేపథ్యంలో నేడు ( శుక్రవారం) మధ్యాహ్నం 1 గంటకు ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. భారత ఎగుమతులపై అమెరికా ఇటీవల విధించిన సుంకాల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ట్రంప్ అక్కసుకు కారణమదేనా?

భారత్ రష్యా ముడి చమురు దిగుమతులను కొనసాగించడం ప్రధాన కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటూ ఇప్పటికే అమల్లో ఉన్న 25% సుంకాలపై అదనంగా మరో 25% పెంపును ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. గత జూలై 20 నుండి అమల్లోకి వచ్చిన సుంకాలకు ఇవి అదనంగా చేరనున్నాయి.

భారత్ రియాక్షన్

అమెరికా నిర్ణయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను "అన్యాయం, అసమంజసం" అని పేర్కొంటూ, భారతదేశ ఇంధన అవసరాలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని గౌరవించాల్సిన అవసరాన్ని అమెరికాకు గుర్తు చేసింది.

మోదీ ధీటైన సమాధానం

కొత్త సుంకాల ప్రకటన అనంతరం ప్రధానమంత్రి మోదీ తొలిసారి రియాక్ట్ అవుతూ.. రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో మాట్లాడుతూ.. "రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వం ప్రధాన్యత, భారతదేశ రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదు. దీనికి వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే," అని ఆయన స్పష్టం చేశారు. సుంకాలపై చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా నిరాకరించారు. ఇది పరిష్కారమయ్యే వరకు చర్చలు జరగవని ఆయన స్పష్టం చేశారు.

కీలక భేటీ

ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ సమీక్ష సమావేశం (High Level Meeting) ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్య, విదేశాంగ, ఆర్థిక, వ్యవసాయ శాఖల మంత్రులు పాల్గొని, సుంకాల ప్రభావం, ప్రతిస్పందన చర్యలు, ఎగుమతిదారులకు ఉపశమన పథకాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సమావేశం మాత్రం చాలా కీలకంగా మారనున్నదనే చెప్పాలి.