Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో బాంబు పేల్చారు. భారత్‌పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీంతో భారత్‌ వస్తువులపై 50 శాతం సుంకం వర్తించనుంది.

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)అన్నంత పని చేశారు. భారత్ ను ఆర్థికంగా దెబ్బకొట్టేలా ఇష్టానుసారంగా చర్యలు తీసుకుంటున్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికే ఉన్న 25% సుంకం విధించిన విషయం తెలిసిందే.

 తాజాగా అదనంగా మరో 25% సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 7, 2025 నుంచి అమలులోకి వస్తాయి. దీని ద్వారా భారత్‌పై మొత్తంగా 50% దిగుమతి సుంకం అమలులోకి రానుంది. అమెరికా అధినేతకు భారత్ పై ఎందుకింత అక్కసు ? ఇలా ఇండియన్ గుడ్స్ పై ఎందుకిలా పన్నుల భారం వేస్తున్నారు.

రష్యా చమురు కొనుగోలే కారణమా?

ఈ నిర్ణయం వెనుక భారత్ .. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందనే అంశమే ప్రధానంగా ఉన్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్ 2024లో రష్యా నుంచి 70 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలలో రెండవ స్థానంలో భారత్ నిలిచింది. మొదటి స్థానంలో చైనా ఉంది. 

రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత, భారత్ రష్యన్ చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది, భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, దీని ద్వారా రష్యాకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని ఆరోపించారు. అదే కారణంగా, భారత్‌పై మరింత ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇటీవల ఓ అమెరికన్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశం అత్యధిక దిగుమతి సుంకాలు విధించే దేశం అని అన్నారు. భారతదేశం చాలా ఎక్కువ సుంకాలు విధిస్తుంది. మాతో తక్కువగా వ్యాపారం చేస్తుంది, కానీ మేం దానితో ఎక్కువగా వ్యాపారం చేస్తున్నాం. ఇది అసమానత్వం. అందుకే భారత్‌పై 25% అదనపు పన్ను విధించాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా చర్యల ప్రభావం

ఇంపోర్ట్ రంగంపై ప్రభావం: భారత్‌కు చెందిన పలు ఉత్పత్తులు ఉక్కు, అల్యూమినియం, ఔషధాలు, యంత్ర పరికరాలు వంటి వాటిపై ఈ అధిక సుంకం ప్రభావానికి లోను కాబోతున్నాయి. అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు మరింత ముదురు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగా భారతీయ పరిశ్రమలపై ఒత్తిడి పెరుగుతుంది. 

అమెరికాకు ఎగుమతి చేసే భారత కంపెనీలపై లాభాల తగ్గుదల, ధరల పెరుగుదల వంటివి ప్రభావితం అవుతాయి. అమెరికా కఠినంగా వ్యవహరించడంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే వాణిజ్య శాఖ వర్గాల ప్రకారం.. దీనిపై త్వరలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, తగిన ప్రతిస్పందన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.