PM Modi on Trump tariff 2025: భారత్‌పై టారిఫ్‌ వార్‌ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు

PM Modi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్‌ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయం మారింది. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రధాని మోడీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు విధించిన 50% సుంకాలపై ప్రధాని మోడీ ఘాటుగా స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ అనే మాటే లేదని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైతే దేనికైనా సిద్ధమేనంటూ ట్రంప్‌కు మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా నుంచే కాదు.. శత్రుదేశాల నుంచి ఒత్తిడినైనా తట్టుకునేందుకు భారత్ రెడీ అన్న సందేశం ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై అదనంగా 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రధాని మోడీ గురువారం ఉదయం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. "రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనేది నాకు తెలుసు. అయినా దేశ రైతులు, మత్స్యకారుల కోసం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం," అని మోదీ స్పష్టం చేశారు.

భారత ఉత్పత్తులపై ఇప్పటి వరకు ఉన్న సుంకాలకు తోడు మరో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరింది. బుధవారం ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, ట్రంప్ నిర్ణయంతో భారత ఎగుమతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత దేశం నుంచి అమెరికాకు ఏటా జరిగే 86 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ఈ అదనపు టారిఫ్ ప్రభావం చూపనుంది. ప్రధానంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం వల్ల దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు), తోలు, పాదరక్షలు, విద్యుత్ పరికరాలు, యంత్రాలు, రసాయనాలు, జంతు సంబంధ ఉత్పత్తులు వంటి అనేక రంగాలపై అదనపు భారం పడనుంది. అలాగే పత్తి, మిర్చి, జీడిపప్పు, మామిడి, బంగాళదుంపలు, చేపలు, పాల ఉత్పత్తులపై కూడా అధిక సుంకాలు విధించనున్నారు. అయితే ఈ ఆదేశాన్ని తక్షణమే అమల్లోకి తీసుకరాకపోయినా.. ఆగస్టు 27నుంచి ఈ అదనపు టారిఫ్ అమలులోకి రానుంది. సెప్టెంబర్ 17 అర్ధరాత్రి వరకు అమెరికా మార్కెట్లోకి వచ్చిన భారత ఉత్పత్తులపై ఈ పెరుగుదల వర్తించదు. అప్పటికే నౌకల్లో ప్రయాణంలో ఉన్న సరుకులపై కూడా ఈ టారిఫ్ వర్తించదు.