PM Modi: "సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 15 వరకు, చాలా అసౌకర్యం ఉంటుంది. నేను ముందుగానే క్షమాపణలు కోరుతున్నాను. వారు మా అతిథులు, ట్రాఫిక్ నియమాలు మార్చబడతాయి, భద్రతా రీత్యా మిమ్మల్నీ అనేక ప్రదేశాలకు వెళ్లకుండా ఆపివేయవచ్చు. కానీ, కొన్ని విషయాలు అవసరం " అని ప్రధాని మోడీ అన్నారు.
PM Modi: ప్రధాని మోడీ దేశరాజధాని ప్రజలకు ముందస్తుగా క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో వారి ఇతరుల కంటే ఎక్కువ బాధ్యత ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని తెలిపారు.
"జీ-20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ పౌరులకు మరింత ఎక్కువ బాధ్యత ఉంది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేసేలా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.దేశ ప్రతిష్టపై ఏమాత్రం ప్రభావం పడకుండా చూసుకోవాలి. దేశ రాజధాని ఢిల్లీకి చాలా మంది అతిథులు వస్తారు. సెప్టెంబర్ 5 నుండి 15 వరకు చాలా అసౌకర్యం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ మారుస్తాం, చాలా చోట్లకు వెళ్లకుండా ఆపేస్తారు. నేను దీనికి ముందుగానే క్షమాపణలు కోరుతున్నాను. కానీ కొన్ని విషయాలు అవసరం." అని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు 29 దేశాల అధినేతలు రానున్నారు. ఈ సందర్భంగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్ నుంచి రాజ్‌ఘాట్, ప్రగతి మైదాన్, ప్రధాన కార్యక్రమ వేదిక సహా 20 ప్రదేశాలను అలంకరించారు. విమానాశ్రయంలో అతిథులు దిగిన దగ్గర నుండి వారి హోటళ్లు, ప్రగతి మైదాన్ వరకు ప్రతిచోటా ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు.
29 దేశాల అధినేతలకు ఆహ్వానం
జి-20కి భారత్ తొలిసారి అధ్యక్షత వహిస్తుండడం గమనార్హం. ఈ సదస్సులో పాల్గొనేందుకు జి-20 సభ్యులు, ఆహ్వానితులతో సహా 29 దేశాల అధినేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొంటాయి. అతిథులకు స్వాగతం పలికేందుకు ఢిల్లీని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గత నెల రోజులుగా అన్ని శాఖల ఉద్యోగులు, కార్మికులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఢిల్లీలోని దాదాపు 60 రోడ్ల సుందరీకరణ పనులు చేపట్టారు.
G-20 సభ్య దేశాలు
G-20లో భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా , టర్కీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇతర ప్రత్యేక ఆహ్వానితులలో బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.
