ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఆస్ట్రేలియా మంత్రి చెప్పిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇది భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య గొప్ప సాంస్కృతిక అనుబంధాన్ని నొక్కి చెబుతుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఆస్ట్రేలియా మంత్రి చెప్పిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ తన ఉపాధ్యాయుల్లో ఒకరు గోవా నుండి ఎలా వలస వచ్చారనే దాని గురించి ప్రధాని మోదీకి వివరించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇది భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య గొప్ప సాంస్కృతిక అనుబంధాన్ని నొక్కి చెబుతుందని అన్నారు. వివరాలు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆంథోని అల్బనీస్‌తో డాన్ ఫారెల్ కూడా భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా లంచ్ మీట్‌లో డారెన్ చెప్పిన విషయాలను మోదీ వరుస ట్వీట్స్ ద్వారా పంచుకున్నారు.
‘‘నా స్నేహితుడు పీఎం అల్బనీస్ గౌరవార్థం మధ్యాహ్న భోజనం సందర్భంగా.. ఆస్ట్రేలియన్ వాణిజ్య, పర్యాటక మంత్రి డాన్ ఫారెల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. గ్రేడ్ 1లో ఆయనకు మిసెస్ ఎబర్ట్ పాఠాలు చెప్పారు.. అది ఆయన జీవితంపై ఎంతగానో ప్రభావం చూపింది. ఆయన ఎడ్యూకేషనల్ గ్రౌండింగ్‌కు సంబంధించి ఆమెకు క్రెడిట్ ఇచ్చారు.
మిసెస్ ఎబర్ట్.. ఆమె భర్త, కూతురు లియోనీ 1950లలో భారతదేశంలోని గోవా నుంచి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు వలస వెళ్లారు. అడిలైడ్‌లోని పాఠశాలలో బోధించడం ప్రారంభించారు. ఎబర్ట్ కుమార్తె లియోనీ సౌత్ ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ అధ్యక్షురాలిగా కొనసాగారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఉన్న గొప్ప సాంస్కృతిక అనుబంధాన్ని నొక్కి చెప్పే ఈ ఉదంతం వినడానికి నేను సంతోషించాను. ఎవరైనా అతని లేదా ఆమె గురువును ఆప్యాయంగా ప్రస్తావించినప్పుడు వినడం కూడా అంతే సంతోషాన్నిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
