మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపే.. మూడోసారి ప్రధాని నేనే - పీఎం మోడీ
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ విజయం సాధిస్తుందని, మూడోసారి తాను ప్రధాని అవుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. 2024 తర్వాత భారతదేశ అభివృద్ధి ప్రయాణం మరింత వేగవంతమవుతుందని అన్నారు.

రానున్ను లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ విజయం సాధించి, తాను మూడోసారి ప్రధానిగా తిరిగి వస్తే.. భారత్ ను ప్రపంచంలోని మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెడుతానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బుదవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కం కన్వెన్షన్ సెంటర్ (ఐటీపీఓ) కాంప్లెక్స్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందని, తన మూడో టర్మ్‌లో భారత్ సగర్వంగా మూడవది పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 2024 తర్వాత భారతదేశ అభివృద్ధి ప్రయాణం మరింత వేగవంతమవుతుందని అన్నారు.
మరోవైపు.. తన ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కొంతమంది పని కట్టుకొని మరీ కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి మార్చుకోవాలని సూచించారు. 'కర్తవ్యపథం' నిర్మిస్తున్నప్పుడు చాలా విషయాలు వార్తాపత్రికల్లో మొదటి పేజీలో బ్రేకింగ్ న్యూస్‌గా మారుతున్నాయన్నారు.
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయని మోడీ పేర్కొన్నారు. ఐ ఈ సి సి కన్వెన్షన్ సెంటర్ ప్రపంచంలోనే ఒక గొప్ప వేదికగా ఉందని అన్నారు. దేశ ప్రజలు గొప్పగా కలలకు రావాలని గొప్పగా ఆలోచించాలని అందుకు తగ్గట్టుగా పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. భారత దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని వ్యతిరేక శక్తులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.
అంతకుముందు.. ఢిల్లీలో డ్రోన్ ద్వారా కొత్త ఐటీపీఓ కాంప్లెక్స్ ను ప్రారంభించి 'భారత్ మండపం'గా నామకరణ చేశారు. అలాగే.. సెప్టెంబరులో G20 లీడర్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రీడెవలప్ చేసిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) కాంప్లెక్స్‌లో కూడా ఆయన పూజలు చేశారు.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకారం.. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) ప్రపంచంలోని ప్రముఖ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా నిలువనున్నది. కాగా.. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) కాంప్లెక్స్ నిర్మాణం కోసం సుమారు రూ. 2,700 కోట్లను ఖర్చు చేశారు. ఈ జాతీయ ప్రాజెక్టును దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.