Burj Khalifa: యూఏఈలో ప్రధాని మోడీ పర్యటన వేళ.. బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..
Burj Khalifa: భారత్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ తన యుఎఇ పర్యటనలో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో పాల్గొనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. భారతదేశ గౌరవార్థం అత్యంత ఎత్తైన భవనంపై 'గెస్ట్ ఆఫ్ హానర్-రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' అని ప్రదర్శించారు.
Burj Khalifa: ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రతిష్టాత్మకమైన బూర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోలను గ్రాండ్‌గా ప్రదర్శించి.. గౌరవ అతిథి - రిపబ్లిక్ ఆఫ్ ఇండియా'అంటూ.. ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అబుదాబిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన సంబంధాలు అంతర్జాతీయ సహకారానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
అనంతరం ప్రధాని మోడీ దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో గౌరవ అతిథిగా పాల్గొని , సమ్మిట్‌లో ప్రత్యేక కీలకోపన్యాసం చేస్తారు. సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. భారతదేశ గౌరవార్థం అత్యంత ఎత్తైన భవనంపై 'గెస్ట్ ఆఫ్ హానర్-రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' అని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన సంబంధాలు అంతర్జాతీయ సహకారానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఉత్తమ అభ్యాసాలు, విజయ గాథలు పంచుకోవడానికి ప్రపంచంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా పరిణామం చెందిందని పేర్కొన్నారు.
మరోవైపు.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఇలా అన్నారు." ఈ సంవత్సరం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ కి గౌరవ అతిథిగా విచ్చేసిన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు, భారతదేశ ప్రధాన మంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీకి మేము హృదయపూర్వక స్వాగతం పలుకుతాము . బలమైన బంధాలు మన దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి ఈ సదస్సు వారధిగా ఉపయోగపడుతుంది. అని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో భారతదేశం విశిష్ట అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉందనిపేర్కొన్నారు.
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈకి వెళ్లిన ప్రధాని మోదీ యూఏఈ ఉపాధ్యక్షుడు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో భేటీ కానున్నారు . యుఎఇ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ అబుదాబిలో బిఎపిఎస్ మందిర్‌ను ప్రారంభించనున్నారు . అంతకుముందు మంగళవారం PM నరేంద్ర మోడీ, UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. సమావేశంలో అనేక అవగాహన ఒప్పందాలు (MOUలు) మార్పిడి చేసుకున్నారు.
యుఎఇ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో పిఎం మోడీ మాట్లాడుతూ.. "బ్రదర్, ముందుగా, మీ సాదర స్వాగతంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఏడు నెలల్లో మేము ఐదుసార్లు కలుసుకున్నాము, ఇది చాలా అరుదు. నేను కూడా ఇక్కడకు ఏడు సార్లు వచ్చే అవకాశం వచ్చింది . మేము ప్రతి రంగంలో పురోగతి సాధించిన విధంగా, ప్రతి రంగంలో భారత్- యుఎఇ మధ్య ఉమ్మడి భాగస్వామ్యం సాగాలి ”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా పాల్గొన్నారు.