జాతీయ సమైక్యత పట్ల పటేల్ నిబద్దత ఆదర్శం: వల్లభాయ్ పటేల్ విగ్రహనికి మోడీ నివాళులు
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్ లోని ఆయన విగ్రహం వద్ద ప్రధాని మోడీ ఇవాళ నివాళులర్పించారు.
గాంధీనగర్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు గుజరాత్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. జాతీయ సమైక్యతకు సర్ధార్ పటేల్ చేసిన సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు.
అచంచలమైన స్పూర్తి, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞత గల నేత పటేల్ అని మోడీ చెప్పారు. జాతీయ సమైక్యత పట్ల పటేల్ నిబద్దత మనకు మార్గదర్శకంగా కొనసాగుతుందని మోడీ పేర్కొన్నారు. సర్ధార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్ కెవాడియా సమీపంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది ఏర్పాటు చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ ఈవెంట్ లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్-చైనా సరిహద్దులోని గ్రామాలకు చెందిన కళాకారులు కూడ ప్రదర్శనలు ఇచ్చారు.
న్యూఢిల్లీలోని పటేల్ చౌక్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు సర్ధార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా జరుపుకుంటారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు.
జాతీయ ఐక్యతలో సర్ధార్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. అఖండ భారత్ కు సర్ధార్ వల్లభాయ్ పేటల్ కారణమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటిష్ పాలకుల చేతిలో విభజనకు గురైన అన్ని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సర్ధార్ పటేల్ పనిచేశారని అమిత్ షా గుర్తు చేశారు.