ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఇళ్లలోనే నిర్బంధించారని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. మనీష్ సిసోడియా వెంట ఢిల్లీ విద్యార్థులు ఉన్నారని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించడానికి ముందు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. సిసోడియాను అరెస్టు చేయడం దురదృష్టకరమని తెలిపారు.
నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోను.. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తా - మనీష్ సిసోడియా
సిసోడియాతో కలిసి రాజ్ ఘాట్ కు వెళ్లకుండా అడ్డుకునేందుకు కొందరు ఆప్ నేతలను గృహనిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు. అంతగా భయపడటం మానుకోవాలని మోడీని కోరుతున్నానని అన్నారు. సిసోడియాకు మద్దతుగా వచ్చే నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని అన్నారు. నేడు మనీష్ సిసోడియా వెంట ఢిల్లీ విద్యార్థులు ఉన్నారని తెలిపారని ‘జీ న్యూస్’ నివేదించింది.
ఇదిలావుండగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రెండో విడత విచారణ ప్రారంభించింది. అయితే దీని కంటే ముందుగా ఆయన రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం సిసోడియా భారీగా బారికేడ్లతో కూడిన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
విచారణకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలుకు వెళ్లడానికి భయపడేది లేదన్నారు. తాను కొన్ని నెలల పాటు జైలులో ఉన్నా పరవాలేదని తెలిపారు. ‘‘ నేను జర్నలిస్ట్ ఉద్యోగం మానేసిన సమయంలో నా భార్య నాకు సపోర్ట్ చేసింది, ఇప్పటికీ నా కుటుంబం నాకు అండగా ఉంది. నన్ను అరెస్టు చేస్తే నా కుటుంబాన్ని నా కార్యకర్తలు చూసుకుంటారు’’ అని అన్నారు. విద్యార్థులు కష్టపడి పనిచేయాలని, తాను జైలుకు వెళ్లినా వారి పనితీరును గమనిస్తూనే ఉంటానని చెప్పారు. ‘‘ కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు చెప్పదలుచుకున్నాను. ఒకవేళ జైలుకు వెళ్లినా విద్యార్థుల పనితీరుపై నిఘా పెడతాను’’ అని అన్నారు.
కాగా.. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మొదటి నిందితుడిగా ఉన్న సిసోడియాను గతేడాది అక్టోబర్ 17న ప్రశ్నించారు. ఆయనతో పాటు ఇతర అనుమానితులు, నిందితులపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ తెరిచి ఉంచినందున సీబీఐ సిసోడియా పేరును చార్జిషీట్ లో చేర్చలేదు. తాజా విచారణలో ఎక్సైజ్ పాలసీలోని వివిధ అంశాలు, మద్యం వ్యాపారులు, రాజకీయ నాయకులతో సిసోడియాకు ఉన్న సంబంధాలు, సాక్షులు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్న అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించే అవకాశం ఉంది.
