సారాంశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర భద్రతా బలగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
Pahalgam Terrorist Atack: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాతీయ భద్రతపై కేంద్ర ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇలా ఇవాళ(మంగళవారం) కూడా ప్రధానమంత్రి నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.
ఈ కీలక సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు. భారత సాయుధ దళాల అధిపతులు - చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్: జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్: జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్: అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ రేపు (ఏప్రిల్ 30) ఢిల్లీలో భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి తర్వాత ఇది రెండవ కీలక భద్రతా సమావేశం. ఈ సమావేశానికి ముందు జరుగుతున్న ఈ హైలెవెల్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. సిసిఎస్, సిసిపిఎ తర్వాత ఆర్థిక వ్యవహారాల కమిటీ కూడా సమావేశం కానుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ఇప్పటికే నిర్ణయించింది. సరిహద్దులను మూసివేసింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు, ఎక్స్ హ్యాండిల్‌లను బ్లాక్ చేసింది. పాకిస్తాన్ హిందువులు, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని మినహాయించి పాకిస్తాన్ పౌరుల వీసాలను ఢిల్లీ రద్దు చేసింది. వైద్య వీసాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.