తైవాన్ మంత్రివర్గానికి మోదీ ఫిదా ... ఆ కేబినెట్ అంతగా ఎందుకు నచ్చిందో తెలుసా?
నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పీఎం మోడీ తైవాన్ మంత్రివర్గం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో కూడా అలాంటి మంత్రివర్గం ఎందుకు ఉండాలో వివరించారు.
PM Modi Podcast : నిఖిల్ కామత్ 'పీపుల్ బై డబ్ల్యుటీఎఫ్' పాడ్‌కాస్ట్‌లో పీఎం నరేంద్ర మోడీ దేశ, విదేశీ పర్యటనలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి విషయాలతో పాటు తన జీవిత ప్రయాణం గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి, ప్రధాని కాకముందు తన విదేశీ పర్యటనల గురించి కూడా చర్చించారు. ఈ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ, భారత ప్రభుత్వంలో కూడా తైవాన్ మంత్రివర్గంలోని వారిలాంటి మంత్రులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎందుకు అలా కోరుకుంటున్నారో కూడా వివరించారు.
తైవాన్ లాంటి మంత్రివర్గం ఎందుకు కావాలి?
తాను ఒకసారి తైవాన్ పర్యటనకు వెళ్ళాను. అప్పుడు తనలో ఒక విద్యార్థి ఉన్నాడని, అందుకే పాలనాపరమైన విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం వుండేదన్నారు ప్రధాని మోదీ. సుపరిపాలన సాగించాలంటే ఎలాంటి మంత్రివర్గం వుంటే మంచిదో తైవాన్ నుండి నేర్చుకున్నానని అన్నారు.
తైవాాన్ కు చెందిన నాయకులందరినీ కలిశానని... అప్పుడు తనకో విషయం అర్థమయ్యిందన్నారు. తైవాన్ మంత్రివర్గంలో ఓ ఆసక్తికర విషయం గమనించారు... అక్కడ ఏ శాఖలకు చెందిన మంత్రి అయినా తాను చూసుకునే విభాగాలపై ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసి ఉండటం ఎంతగానో ఆకట్టుకుంది. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగల యువతది కీలకపాత్ర... అలాంటివారే అక్కడ మంత్రులుగా వున్నారు. మనదేశంలో కూడా ఇలాంటి మంత్రివర్గమే ఉండాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు.
వ్యాపారవేత్తకు అడిగిన ప్రశ్న
తైవాన్‌లో తనకు ఒక వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు... అతడు చాలా పెద్ద ఇంజనీర్ అని ప్రధాని మోదీ తెలిపారు. తన పది రోజుల పర్యటనలో చివరి రోజున అతను ఒక ప్రశ్న అడిగాడు... మీ దేశంలో ఇంకా నాగుపాముల ఆటలు, మంత్రాలు చేస్తారా? అని అడిగాడు. అతని మనస్సులో భారతదేశం గురించి అలాంటి అభిప్రాయం ఉందని తనకు అర్థమైంది... దాన్ని మార్చాలని భావించానని ప్రధాని తెలిపారు.
ఆ ఇంజనీర్ కు తాను సరదాగా ఇలా సమాధానం ఇచ్చాను. మా పూర్వీకులు పాములతో ఆడుకునేవారు, కానీ మేము మౌస్‌తో ఆడుకుంటాము అని చెప్పాను. మా దేశ బలం మౌస్‌తో ఆడుకునేది, పాములతో ఆడుకునే కాలం పోయిందని సరదాగా చెప్పానని వెల్లడించారు. ఇలా మన సంస్కృతికి గౌరవిస్తూనే ఇన్ఫర్మేషన్ ఆండ్ టెక్నాలజీ రంగాలో ఇండియా ఎలా దూసుకుపోతుందో తెలిపారు మోదీ.