Anthony Albanese: ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఆంథోనీ ఆల్బనీస్ మళ్ళీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆల్బనీస్ గెలుపుపై మోడీ శుభాకాంక్షలు తెలిపారు. గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన తొలి ఆస్ట్రేలియా నేత ఆయనే.
X (ట్విట్టర్)లో మోడీ స్పందిస్తూ.. "ఆంథోనీ ఆల్బనీస్, మీ గొప్ప విజయానికి, ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఎన్నికవడం పట్ల అభినందనలు. ఈ గెలుపు మీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని చాటుతోంది" అని పేర్కొన్నారు.
ఇండో-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం
మోడీ ఇంకా "ఇండో-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని సాధించడానికి మీతో కలిసి పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-ఆస్ట్రేలియా సహకారం పెరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఆల్బనీస్, మోడీల మధ్య వ్యూహాత్మక సహకారం బాగా పెరిగింది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, వాణిజ్యం, రక్షణ, క్వాడ్ వంటి అంశాల్లో సహకారం బలపడింది.
ఆస్ట్రేలియా ఎన్నికలు 2025 చారిత్రాత్మకం
ఆల్బనీస్ పార్టీకి వచ్చిన భారీ మెజారిటీ ఆస్ట్రేలియా ప్రజల నమ్మకాన్ని చూపిస్తోంది. భారత్‌కు ఈ ఫలితం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆస్ట్రేలియాతో విద్య, వాణిజ్యం, రక్షణ, వలసలు వంటి రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతోంది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్ ఫ్రాంక్ బొంగియోర్నో మాట్లాడుతూ, ఆల్బనీస్ నాయకత్వం ఆచరణాత్మకత, సామాజిక న్యాయంపై దృష్టి సారిస్తుందని అన్నారు. అలాగే, "ఆల్బనీస్ తన బృందంతో కలిసి దేశాన్ని కష్టకాలం నుంచి బయటపడేసేందుకు చాలా కీలకమైన చర్యలు తీసుకున్నారని" చెప్పారు.
అయితే, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఆల్బనీస్ చైనాతో సంబంధాలు, అంతర్జాతీయ రాజకీయాలు వంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆంథనీ అల్బనీస్ కొత్త చరిత్ర
ఆస్ట్రేలియాలో మే 3న 48వ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ నాయకుడు ఆంథనీ అల్బనీస్ విజయం సాధించి, ఇరవై ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఓటింగ్ ముగిశాక తన విజయ ప్రసంగంలో, "ప్రపంచ సమస్యల్ని ఆస్ట్రేలియన్ మార్గంలో ఎదుర్కొంటాం" అని చెప్పిన అల్బనీస్, దేశీయ విలువలు, ప్రజలపై గల విశ్వాసాన్ని ప్రస్తావించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వ్యాపార టారిఫ్‌లపై అల్బనీస్ తీసుకున్న గట్టి వైఖరి, ఆర్థిక పునరుజ్జీవనాన్ని ఆయన పాలన సాధించగలగడం వల్లే విజయం సాధించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది "ట్రంప్ ఎఫెక్ట్" అంటూ ఆస్ట్రేలియా ఖజానా శాఖ మంత్రి జిమ్ చాల్మర్స్ అభివర్ణించారు.


