ఎయిర్ ఇండియా, బోయింగ్‌ల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. 200కు పైగా విమానాలను బోయింగ్ నుంచి ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడానికి డీల్ కుదరడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ డీల్‌ను స్వాగతించారు.
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఫిబ్రవరి 14న వారిద్దరూ మాట్లాడుకున్నారు. అమెరికన్ ఎరో స్పేస్ మేజర్ బోయింగ్, ఇండియన్ క్యారియర్ అయినటువంటి ఎయిర్ ఇండియాల మధ్య చారిత్రక డీల్ కుదిరింది. ఉభయ దేశాలు ఈ డీల్‌తో పరస్పరం ప్రయోజనం పొందనున్నాయని, ఉపాధి అవకాశాలను ఈ డీల్ సృష్టిస్తుందని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉభయ దేశాల మధ్య గల సహకారానికి ఈ డీల్ స్పష్టమైన ఉదాహరణ అని వివరించింది. పీఎం మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరువురూ ఈ డీల్‌ను స్వాగతించారు.
ఎయిర్ ఇండియా ప్రకటించిన డీల్ వివరాల ప్రకారం, ఎయిర్‌లైన్ 190 నారో బాడీ 737 మ్యాక్స్ జెట్‌లు, 30 వైడ్ బాడీ ఫ్లైట్‌లు, బోయింగ్ 787 విమానాలు 20, బోయింగ్ 777ఎక్స్ విమానాలు పది కొనబోతున్నది. ఈ డీల్‌లో భాగంగా తొలి బ్యాచ్ ఆర్డర్ ఈజ ఏడాది ద్వితీయార్థంలో డెలివరీ అవుతాయని టాటా గ్రూప్ పరిధిలోని ఎయిర్ ఇండియా ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
Also Read: భద్రాచలం మూడు ముక్కలు .. 7 మండలాలు లాక్కుంటుంటే కేసీఆర్ నోరెత్తలేదు : భట్టి
ఎయిర్ ఇండియా, బోయింగ్ డీల్‌ను వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది. ప్రపంచంలోనే మ్యానుఫ్యాక్చరింగ్‌లో అమెరికా నాయకత్వ స్థానంలో ఉన్నదని, ఇకపైనా ఉంటుందని జో బైడెన్ తెలిపారు. ఎయిర్ ఇండియా, బోయింగ్ ఒప్పందం ద్వారా సుమారు 200 విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని తెలుపడానికి గర్వపడుతున్నట్టు వివరించారు.
ఈ డీల్ అమెరికా, ఇండియాల బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని వెల్లడిస్తున్నదని బైడెన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో సంయుక్తంగా ముందడుగు వేస్తూ ఉభయ దేశాల సంబంధాలు మరింత బలోపేతానికి తాను, పీఎం మోడీ మరింత కృషి చేస్తామని వివరించారు.
